
టీమిండియా యువ ఆల్‌రౌండర్ నితీశ్ కమార్ రెడ్డి (Nitish Kumar Reddy)పై భారత దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ప్రశంసలు కురిపించాడు. ఈ ఆంధ్ర ఆటగాడు మూడు ఫార్మాట్లలోనూ సత్తా చాటి ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడని పేర్కొన్నాడు.
అరుదైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండ్ నైపుణ్యాలతో జట్టులోకి వచ్చిన నితీశ్ రెడ్డి.. ఇప్పటికే టెస్టుల్లో కీలక ఆటగాడిగా మారాడు. అంతకుముందే టీ20 ఫార్మాట్లోనూ అరంగేట్రం చేసిన ఈ విశాఖ కుర్రాడు.. తాజాగా ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌తో వన్డేల్లోనూ అడుగుపెట్టాడు.
ఆల్ ఫార్మాట్ గ్రేట్‌గా
టీమిండియా దిగ్గజ సారథి రోహిత్ శర్మ చేతుల మీదుగా వన్డే క్యాప్ అందుకున్నాడు నితీశ్ రెడ్డి. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. ‘‘క్యాప్ నంబర్ 260. నితీశ్ రెడ్డి. నీ ఆటిట్యూడ్, నైపుణ్యాలతో కెరీర్‌ను గొప్పగా ఆరంభించావు.
ఇదే జోరును కొనసాగిస్తే వందకు 110 శాతం.. నువ్వు టీమిండియాతో సుదీర్ఘకాలం పాటు ప్రయాణం చేస్తావని చెప్పగలను. ఆల్ ఫార్మాట్ గ్రేట్‌గా ఎదగబోతున్నావని అనిపిస్తోంది. నీపై నాకు ఆ నమ్మకం ఉంది. ప్రతి ఫార్మాట్లోనూ ఆడాలన్న నీ కల నెరవేరింది.

అందరూ నీకు తోడుగా ఉంటారు
నీకు జట్టు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ఆటగాడిగా నీకేం కావాలో అన్నీ సమకూరుస్తుంది. ఎప్పుడు, ఏం కావాలన్నా అందరూ నీకు తోడుగా ఉంటారు. ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తారు. గుడ్ లక్. నీ కెరీర్ గొప్పగా ఉండాలి’’ అంటూ రోహిత్ శర్మ నితీశ్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తూ శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కాగా ఆసీస్‌తో తొలి వన్డేలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన నితీశ్ రెడ్డి 11 బంతుల్లో రెండు సిక్సర్ల సాయంతో 19 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక ఇప్పటి వరకు టీమిండియా తరఫున టీ20 మ్యాచ్‌లు, తొమ్మిది టెస్టులు ఆడిన ఈ రైటార్మ్ మీడియం పేసర్.. టెస్టుల్లో ఎనిమిది, టీ20లలో మూడు వికెట్లు తీశాడు.
అపుడు కోహ్లి.. ఇపుడు రోహిత్
అదే విధంగా ఈ కుడిచేతి వాటం బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఖాతాలో టెస్టుల్లో 386, టీ20లలో 90 పరుగులు ఉన్నాయి. కాగా గతేడాది పెర్త్ వేదికగా భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి చేతుల మీదుగా టీమిండియా టెస్టు క్యాప్ అందుకున్న 22 ఏళ్ల నితీశ్ రెడ్డి.. తాజాగా అదే వేదిక మీద రోహిత్ చేతుల మీదుగా వన్డే క్యాప్ అందుకోవడం విశేషం. తన కెరీర్‌లో చిరస్మరణీయంగా గుర్తుండిపోయే ఈ క్షణాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గిల్ సేనకు ఓటమి
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆసీస్‌తో తొలి వన్డేలో టీమిండియా ఓటమిని చవిచూసింది. వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసి తొమ్మిది వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.
ఇక డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియా తమ ముందు 131 పరుగుల లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు కోల్పోయి 21.1 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా టీమిండియాపై ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించి.. మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య గురువారం అడిలైడ్ వేదికగా రెండో వన్డే నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.
చదవండి: నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు.. కానీ ఇదేం పద్ధతి?: అశూ ఫైర్