వైభవ్‌కు షాకిచ్చి.. రికార్డుల మోత మోగించిన గిల్‌ | Gill Overshadows Vaibhav Sooryavanshi Innings Makes New IPL Records | Sakshi
Sakshi News home page

వైభవ్‌కు షాకిచ్చి.. రికార్డుల మోత మోగించిన గిల్‌

May 30 2026 12:07 PM | Updated on May 30 2026 12:11 PM

Gill Overshadows Vaibhav Sooryavanshi Innings Makes New IPL Records

గుజరాత్‌ టైటాన్స్‌ ముచ్చటగా మూడోసారి ఐపీఎల్‌ ఫైనల్‌కు చేరింది. తమ అరంగేట్ర సీజన్‌ 2022లో ఏకంగా చాంపియన్‌గా నిలిచిన టైటాన్స్‌.. 2023లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. తాజాగా ఐపీఎల్‌-2026లో ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించిన గుజరాత్‌ జట్టు.. క్వాలిఫయర్‌-2లో జయభేరి మోగించింది.

రాజస్తాన్‌ రాయల్స్‌తో శుక్రవారం జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ముల్లన్‌పూర్‌లో రాయల్స్‌ విధించిన 215 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే గుజరాత్‌ ఊదేసింది.  తద్వారా ఆర్సీబీతో ఆదివారం నాటి టైటిల్‌ పోరుకు అర్హత సాదించింది. 

47 బంతుల్లోనే
ఇక ఈ విజయంలో ఓపెనర్‌, కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill)ది కీలక పాత్ర. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో కేవలం 47 బంతుల్లోనే అతడు శతక్కొట్టాడు. మొత్తంగా 53 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 104 పరుగులు సాధించాడు. జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోవడంతో గిల్‌ మెరుపు ఇన్నింగ్స్‌కు తెరపడింది.

ఏదేమైనా క్వాలిఫయర్‌-2లో అద్భుత శతకంతో రాణించి జట్టును గెలిపించిన గిల్‌.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు. కాగా అతడికి ఐపీఎల్‌లో ఇది ఐదో సెంచరీ. ఈ మ్యాచ్‌ సందర్భంగా గిల్‌ సాధించిన రికార్డులు ఇవీ..

ఐపీఎల్‌లో అత్యధిక శతకాల వీరుల జాబితాలో..
👉విరాట్‌ కోహ్లి- 9 శతకాలు
👉జోస్‌ బట్లర్‌- 7 శతకాలు
👉క్రిస్‌ గేల్‌, కేఎల్‌ రాహుల్‌- 6 శతకాలు
👉సంజూ శాంసన్‌, శుబ్‌మన్‌ గిల్‌- 5 శతకాలు
👉డేవిడ్‌ వార్నర్‌, షేన్‌ వాట్సన్‌- 4 శతకాలు

గుజరాత్‌ తరఫున ఫాస్టెస్ట్‌ సెంచరీలు
👉శుబ్‌మన్‌ గిల్‌- 47 బంతుల్లో 2026లో రాజస్తాన్‌పై
👉శుబ్‌మన్‌ గిల్‌- 49 బంతుల్లో 2023లో ముంబైపై
👉శుబ్‌మన్‌ గిల్‌- 50 బంతుల్లో 2024లో చెన్నైపై
👉సాయి సుదర్శన్‌- 50 బంతుల్లో 2024లో చెన్నైపై

ఐపీఎల్‌లో కెప్టెన్‌గా అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్లు
👉విరాట్‌ కోహ్లి- 5
👉కేఎల్‌ రాహుల్‌- 3
👉శుబ్‌మన్‌ గిల్‌- 2.

కాగా గుజరాత్‌తో మ్యాచ్‌లోనూ రాజస్తాన్‌ చిచ్చర పిడుగు వైభవ్‌ సూర్యవంశీ అద్భుతంగా ఆడాడు. 47 బంతులలో 96 పరుగులు చేశాడు. అయితే, గిల్‌ సెంచరీతో చెలరేగి అతడి ఇన్నింగ్స్‌కు విలువ లేకుండా చేసి పడేశాడు.

చదవండి: మేము ఇక్కడిదాకా రావటమే గొప్ప: రియాన్‌ పరాగ్‌

Advertisement
 
Advertisement
Advertisement