గుజరాత్‌ ఘనంగా ఫైనల్‌కు | IPL 2026 Qualifier 2: Shubman Gill Century Helps Gujarat Titans Beat Rajasthan Royals | Sakshi
Sakshi News home page

గుజరాత్‌ ఘనంగా ఫైనల్‌కు

May 29 2026 11:38 PM | Updated on May 30 2026 8:32 AM

 IPL 2026 Qualifier 2: Shubman Gill Century Helps Gujarat Titans Beat Rajasthan Royals

ఐపీఎల్‌ టైటిల్‌ పోరుకు టైటాన్స్‌ అర్హత

క్వాలిఫయర్‌–2లో విజయం

శుబ్‌మన్‌ గిల్‌ సెంచరీ

7 వికెట్లతో రాజస్తాన్‌ రాయల్స్‌ ఓటమి

వైభవ్‌ మెరుపులు వృథా 

రేపు బెంగళూరుతో గుజరాత్‌ ఆఖరి సమరం  

ఐపీఎల్‌లో ఫైనల్‌ చేరేందుకు రెండో క్వాలిఫయర్‌లో గుజరాత్‌ విజయలక్ష్యం 215 పరుగులు... కానీ నాకౌట్‌ మ్యాచ్‌లోనూ ఒత్తిడి లేకుండా శుబ్‌మన్‌ గిల్, సాయి సుదర్శన్‌ జోడీ తమ ఆటతో దీనిని చాలా చిన్నదిగా మార్చేశారు. విధ్వంసక ప్రదర్శన లేకుండానే తమదైన శైలిలో ఓపెనర్లు 77 బంతుల్లోనే 167 పరుగులు జోడించడంతో టైటాన్స్‌ ఫైనల్‌ చేరడం లాంఛనంగా మారిపోయింది. 

కీలక పోరులో రాజస్తాన్‌ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. అంతకుముందు మరోసారి సెంచరీ చేజారినా... వైభవ్‌ సూర్యవంశీ తుఫాన్‌ బ్యాటింగ్‌తోనే రాయల్స్‌ చెప్పుకోదగ్గ స్కోరు సాధించగలిగింది. తమ సొంతగడ్డపై ఫైనల్‌ ఆడనున్న గుజరాత్‌... తుది పోరులో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును ఓడించి రెండోసారి టైటిల్‌ సాధిస్తుందా చూడాలి.  

న్యూ చండీగఢ్‌: మాజీ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ మూడోసారి ఐపీఎల్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్‌–2లో గుజరాత్‌ 7 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ను ఓడించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన వైభవ్‌ సూర్యవంశీ (47 బంతుల్లో 96; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సెంచరీ అవకాశం కోల్పోయాడు. 

రవీంద్ర జడేజా (35 బంతుల్లో 45 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించగా, డొనొవాన్‌ ఫెరీరా (11 బంతుల్లో 38 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) చివర్లో చెలరేగాడు. అనంతరం గుజరాత్‌ 18.4 ఓవర్లలో 3 వికెట్లకు 219 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (53 బంతుల్లో 104; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఐపీఎల్‌లో ఐదో సెంచరీతో చెలరేగగా... సాయి సుదర్శన్‌ (32 బంతుల్లో 58; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ చేశాడు. రేపు అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్లో బెంగళూరుతో గుజరాత్‌ తలపడుతుంది.  

వైభవ్‌ దూకుడు... 
గత మ్యాచ్‌లతో పోలిస్తే వైభవ్‌ ఈసారి కాస్త ఓపికను ప్రదర్శించాడు. తొలి ఓవర్లోనే జైస్వాల్‌ (1), తర్వాతి ఓవర్లో ధ్రువ్‌ జురేల్‌ (7) వెనుదిరగడం కూడా అందుకు కారణం. సిరాజ్‌ ఓవర్లో 3 ఫోర్లు బాదిన వైభవ్‌ 14వ బంతికిగానీ తన తొలి సిక్స్‌ కొట్టలేదు. అయితే నాలుగో స్థానంలో వచి్చన జడేజా చకచకా పరుగులు రాబట్టాడు. ప్రసిధ్‌ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌ కొట్టిన అతను 19 బంతుల్లోనే 34 పరుగులకు చేరుకున్నాడు. అయితే మోచేతి గాయంతో రిటైర్డ్‌హర్ట్‌గా తప్పుకోగా, ఆ తర్వాత రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ తడబడింది. 

జడేజా మళ్లీ క్రీజ్‌లోకి వచి్చనా తర్వాతి 14 బంతుల్లో 11 పరుగులే చేయగలిగాడు. మరోవైపు 46 పరుగుల వద్ద సుదర్శన్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన వైభవ్‌ 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని కెరీర్‌లో ఇదే అది నెమ్మదైన అర్ధ సెంచరీ! హాఫ్‌ సెంచరీ తర్వాత దూకుడు చూపించిన వైభవ్‌ తర్వాత ఆడిన 15 బంతుల్లో చెలరేగి 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 96కు చేరుకున్నాడు. ఈసారైనా సెంచరీ ఖాయం అనుకోగా... మళ్లీ సరిగ్గా గత మ్యాచ్‌ తరహాలోనే ర్యాంప్‌ షాట్‌ ఆడబోయి మరోసారి షార్ట్‌ థర్డ్‌మాన్‌లోకి క్యాచ్‌ ఇచ్చాడు. అయితే రషీద్‌ వేసిన చివరి ఓవర్లో రెచి్చపోయిన ఫెరీరా 4 సిక్స్‌లు బాదడంతో మొత్తం 27 పరుగులు లభించాయి.  

పరుగుల జుగల్‌బందీ... 
ఛేదనలో గుజరాత్‌ అలవోకగా దూసుకుపోయింది. రాయల్స్‌ పేలవ బౌలింగ్‌తో సుదర్శన్, గిల్‌ ఎలాంటి శ్రమ లేకుండా ఒకరితో మరొకరు పోటీ పడుతూ సునాయాసంగా పరుగులు రాబట్టారు. ఆర్చర్‌ వేసిన తొలి ఓవర్లో ఇద్దరూ చెరో 2 ఫోర్లతో మొదలు పెట్టగా, పవర్‌ప్లేలో జట్టు 10 ఫోర్లు సహా 69 పరుగులు రాబట్టింది. సుదర్శన్‌ 14 వద్ద ఉన్నప్పుడు ఫెరీరా, షనక సమన్వయ లోపంతో క్యాచ్‌ వదిలేయడం కూడా గుజరాత్‌కు కలిసొచి్చంది. 

ఆపై తుషార్‌ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌ కొట్టి 30 బంతుల్లో హాఫ్‌ సెంచరీని చేరిన గిల్‌... జడేజా ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్‌ కొట్టాడు. అనంతరం 26 బంతుల్లోనే సుదర్శన్‌ అర్ధ సెంచరీ కూడా పూర్తయింది. ఎట్టకేలకు 13వ ఓవర్లో సుదర్శన్‌ ‘హిట్‌ వికెట్‌’తో ఈ భారీ భాగస్వామ్యానికి తెర పడింది. సుదర్శన్‌ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ అనూహ్యంగా ఒకే తరహాలో అవుట్‌ కావడం విశేషం. 47 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న గిల్, సుందర్‌ (16) తక్కువ వ్యవధిలో అవుటైనా... తెవాటియా (17 నాటౌట్‌), బట్లర్‌ (9 నాటౌట్‌) కలిసి ఆటను ముగించారు.  

స్కోరు వివరాలు  
రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) ప్రసిధ్‌ (బి) సిరాజ్‌ 1; వైభవ్‌ (సి) ప్రసిధ్‌ (బి) రబాడ 96; జురేల్‌ (సి) గిల్‌ (బి) రబాడ 7; జడేజా (నాటౌట్‌) 45; పరాగ్‌ (సి) రబాడ (బి) హోల్డర్‌ 11; షనక (సి) బట్లర్‌ (బి) హోల్డర్‌ 3; ఆర్చర్‌ (సి) బట్లర్‌ (బి) ప్రసిధ్‌ 7; ఫెరీరా (నాటౌట్‌) 38; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 214. వికెట్ల పతనం: 1–2, 2–9, 3–101, 4–109, 5–118, 6–172. బౌలింగ్‌: సిరాజ్‌ 4–0–42–1, రబాడ 4–0–35–2, ప్రసిధ్‌ 4–0–42–1, సుందర్‌ 2–0–23–0, హోల్డర్‌ 4–0–27–2, రషీద్‌ 2–0–45–0. 



గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సుదర్శన్‌ (హిట్‌ వికెట్‌) (బి) బ్రిజేశ్‌ 58; గిల్‌ (ఎల్బీ) (బి) ఆర్చర్‌ 104; బట్లర్‌ (నాటౌట్‌) 9; సుందర్‌ (సి) ఫెరీరా (బి) బర్గర్‌ 16; తెవాటియా (నాటౌట్‌) 17; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (18.4 ఓవర్లలో 3 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–167, 2–182, 3–201. బౌలింగ్‌: ఆర్చర్‌ 4–0–45–1, బర్గర్‌ 4–0–35–1, బ్రిజేశ్‌ 3.4–0–44–1, తుషార్‌ 3–0–34–0, యశ్‌రాజ్‌ 2–0–29–0, జడేజా 2–0–28–0.  

టాస్‌ గందరగోళం... 
మ్యాచ్‌కు ముందు టాస్‌ సమయంలో జరిగిన ఘటన తీవ్ర చర్చకు కారణమైంది. గిల్‌ నాణెం విసరగా, పరాగ్‌ ‘హెడ్స్‌’ చెప్పాడు. అయితే నాణెం కింద పడిన తర్వాత దానిని స్పష్టంగా చూపించకుండా రిఫరీ ప్రకాశ్‌ భట్‌ తాను ‘సరిగా వినలేదని’... టాస్‌ మళ్లీ వేయమని కోరాడు. దాంతో మళ్లీ నాణెం విసరగా, ఈసారి పరాగ్‌ టాస్‌ నెగ్గాడు. దాంతో గిల్‌ తన అసంతృప్తిని ప్రదర్శించాడు. గత మ్యాచ్‌లో వాడిన పిచ్‌ కాబట్టి తాను కూడా బ్యాటింగ్‌ ఎంచుకునేవాడినని, అయితే దురదృష్టవశాత్తూ రిఫరీ సరిగా వినలేదని అతను వ్యాఖ్యానించాడు. మ్యాచ్‌లో టైటాన్స్‌ ఓడి ఉంటే ఇది కూడా పెద్ద వివాదానికి కారణమయ్యేదేమో.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement