
టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మద్దతుగా నిలిచాడు. గతంలో గిల్‌పై విమర్శలు చేసినవారిని గంభీర్ తప్పు పట్టాడు. ‘గిల్ ప్రతిభ విషయంలో ఎప్పుడూ ఎలాంటి సందేహాలు లేవు. అతడిని విమర్శిస్తున్నవారికి క్రికెట్ గురించే తెలియకపోవచ్చు. అతడి ప్రదర్శన మాకు ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. అతడిపై కెప్టెన్సీ ఒత్తిడి కూడా లేదని తేలిపోయింది’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు.
కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా మాంచెస్టర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టును భారత్ డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. ఓపెనర్ కేఎల్ రాహుల్, కెప్టెన్ గిల్, ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ పోరాట పటిమ కారణంగా ఇది సాధ్యమైంది.
మేము ఇంకా 1–2తో వెనుకబడే ఉన్నాం
ఈ నేపథ్యంలో గంభీర్ మాట్లాడుతూ.. ‘భారత బ్యాటర్లు కనబర్చిన పోరాటపటిమను కెప్టెన్ గిల్ ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. అయితే ఈ డ్రాతో ఏదో సాధించామని భావించడం లేదని, తర్వాతి పోరులో గెలిచేందుకు ప్రయత్నిస్తామని అతను అన్నాడు.
‘నేను ‘డ్రా’ కంటే మ్యాచ్‌లో ఫలితం రావడాన్నే ఇష్టపడతా. మేం ఇంకా 1–2తో వెనుకబడి ఉన్నామనే విషయం మర్చిపోలేదు. దీనిని 2–2గా మార్చడం అవసరం. మా ఆటగాళ్లకు తగినంత అనుభవం లేకపోయినా ప్రస్తుతం ఇది మా ఉత్తమ జట్టు.
వీరంతా ఎవరో ఒకరిని అనుకరించడం కాకుండా తామే కొత్త చరిత్ర సృష్టించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు’ అని పేర్కొన్నాడు. మరో వైపు.. ఓవల్ మైదానంలో జరిగే చివరి టెస్టులో శార్దుల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్ స్థానాల్లో కుల్దీప్ యాదవ్, ఆకాశ్‌దీప్ వచ్చే అవకాశాలున్నాయి.
పంత్‌పై ప్రశంసలు
గాయం తాలుకు నొప్పి వేధిస్తున్నా మాంచెస్టర్ టెస్టులో బ్యాటింగ్‌కు దిగిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌పై గంభీర్ ప్రశంసలు కురిపించాడు. ‘‘అతడు సిరీస్‌లో మిగిలిని ఆఖరి మ్యాచ్‌కు దూరమయ్యాడని అందరికీ తెలుసు.
అయితే, జట్టు నిర్మాణంలో పంత్ వంటి పట్టుదల కలిగిన ఆటగాళ్ల పాత్ర ఎంతో కీలకమైనది. దేశం కోసం, జట్టు కోసం రిషభ్ ఏం చేశాడో అందరమూ చూశాం కదా! అతడిని ఎంత పొగిడినా తక్కువే. వేలు విరిగినా అతడు బ్యాటింగ్ చేశాడు.
పంత్‌లా అందరికీ ఇలాంటివి సాధ్యం కావు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవేళ నేనున్నానంటూ తను ముందుకు వచ్చాడు. టెస్టు జట్టులో పంత్ అత్యంత ముఖ్యమైన సభ్యుడు. అతడు త్వరలోనే కోలుకుని మళ్లీ మైదానంలో అడుగుపెట్టాలని కోరుకుంటున్నా’’ అని గంభీర్ పేర్కొన్నాడు.
చదవండి: ఖలీల్ అహ్మద్ కీలక నిర్ణయం