Photo Credit : Twitter
భారత మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్ 22 ఏళ్ల నాటి క్రిమినల్ కేసులో నిర్దోషిగా విడుదలయ్యాడు. 2004లో జాకబ్ మార్టిన్ పాస్‌పోర్ట్ ఫోర్జరీ చేశాడన్న ఆరోపణలు రావడంతో అతడిపై క్రిమినల్ కేసు నమోదైంది. ఐపీసీలోని సెక్షన్లు 420, 468, 471, 120బితో పాటు పాస్‌పోర్ట్ చట్టంలోని సెక్షన్ 12 కింద జాకబ్ మార్టిన్‌పై అభియోగాలు మోపబడ్డాయి.
తాజాగా 22 ఏళ్ల తర్వాత పాస్‌పోర్ట్ ఫోర్జరీ, నకిలీ యూకే ఇమ్మిగ్రేషన్ స్టాంప్, ప్రయాణ ఏర్పాట్లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి జాకబ్‌పై వచ్చిన ఆరోపణలు రుజువు కాలేదు. దీంతో పాటియాలా హౌస్ కోర్టు జాకబ్‌పై వచ్చిన ఆరోపణలన్నింటిని కొట్టివేస్తూ నిర్దోషిగా విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
జాకబ్ మార్టిన్ పాస్‌పోర్ట్ అవకతవకలకు పాల్పడినట్లు గానీ, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి విశ్వసనీయమైన ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. కేసులో ముఖ్యులైన పలువురు సాక్ష్యాలు, ఆధారాలు నిరూపించడంలో విఫలమయ్యారని, అందుకే జాకబ్ మార్టిన్‌ను నిర్దోషిగా విడుదల చేస్తున్నట్లు పాటియాలా కోర్టు తమ తీర్పును వెల్లడించింది. తాను నిర్దోషిగా విడుదలవ్వడంపై జాకబ్ మార్టిన్ మీడియాతో స్పందించాడు.
"2004లో యూకే పర్యటనకు వెళ్లిన జట్టులో ఒక సభ్యుడు వీసా గడువు ముగిసినప్పటికీ అక్కడే ఉండిపోయాడు. అయితే నకిలీ ఇమ్మిగ్రేషన్ స్టాంప్ పొంది భారత్‌కు తిరిగి రావడంతోనే పట్టుబడడంతో కేసు వెలుగులోకి వచ్చింది. అసలు ఎఫ్ఐఆర్‌లో మొదట నా పేరు లేదు. కానీ విచారణ సమయం వచ్చేనాటికి నా పేరును కేసులో చేర్చారు.
తాను అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదగకూడదనే ఉద్దేశంతో కొందరు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఏ తప్పు చేయనప్పటికీ నేను దోషిగా తేలడం వల్ల రైల్వే ఉద్యోగాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. క్రికెటర్‌గా ఎదగలేకపోయానన్న బాధ ఒత్తిడికి గురయ్యాను. తాజాగా 22 ఏళ్ల తర్వాత కేసులో నిర్దోషిగా బయటికి రావడం ఉపశమనాన్ని కలిగిస్తోంది. ఇది నా జీవితంలో ఒక కీలక మలుపు" అని చెప్పుకొచ్చాడు.
1999లో అంతర్జాతీయ అరంగేట్రం
ఇక కుడిచేతి వాటం బ్యాటర్ అయిన జాకబ్ మార్టిన్ 1999 సెప్టెంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌లతో జరిగిన ట్రై సిరీస్‌లోనూ పాల్గొన్నాడు. తదనంతరం ఫామ్ కోల్పోవడంతో జాకబ్ జట్టులో చోటు కోల్పోయాడు.
టీమిండియా తరఫున 10 వన్డేలు ఆడిన జాకబ్ మార్టిన్ 22.57 సగటుతో 158 పరుగులు సాధించాడు. ఇక ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో 138 మ్యాచ్‌లాడి 9,192 పరుగులు సాధించిన జాకబ్ మార్టిన్ 23 శతకాలు సాధించాడు. ఇక లిస్ట్-ఏ క్రికెట్‌లో 104 మ్యాచ్‌లాడి 2,948 పరుగులు చేశాడు.


