
బంగ్లాదేశ్ దిగ్గజ బ్యాటర్, ఆ దేశ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (36) నిన్న ఉదయం తీవ్రమైన గుండెపోటుకు గురయ్యాడు. ఢాకా ప్రీమియర్ లీగ్‌లో మ్యాచ్ ఆడుతుండగా ఈ ఘటన జరిగింది. ఫీల్డింగ్ చేస్తుండగా తమీమ్‌కు రెండు సార్లు ఛాతీ నొప్పి వచ్చినట్లు తెలుస్తుంది. విషయం తెలిసి అందుబాటులో ఉన్న వారు తమీమ్‌ను ఆసుపత్రికి తరలించారు. స్పృహ కోల్పోయిన తమీమ్‌కు ఆసుపత్రిలో డాక్టర్లు గంట సేపు సీపీఆర్ చేశారు.
డాక్టర్లు తమీమ్ గుండె ధమనాల్లో పూడికలు ఉన్నట్లు గుర్తించారు. నిన్ననే తమీమ్ గుండెకు స్టంట్‌లు వేశారు. తమీమ్ ఆసుపత్రికి చేరిన సమయంలో పరిస్థితి విషమంగా ఉండిందని డాక్టర్లు తెలిపారు. ఆసుపత్రికి రావడం లేట్ అయ్యుంటే తమీమ్ ప్రాణాలు కోల్పోయేవాడని అన్నారు.
ప్రస్తుతం తమీమ్ ప్రాణాపాయస్థితి నుంచి బయటపడి కోలుకునే క్రమంలో ఉన్నాడని తెలుస్తుంది. తమీమ్ ఇవాళ ఉదయమే స్పృహలోకి వచ్చాడని సమాచారం. తమీమ్ తన కుటుంబ సభ్యులతో మాట్లాడాడని బంగ్లాదేశ్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
తమీమ్ గుండెపోటుకు గురయ్యాడని తెలిసి క్రికెట్ ప్రపంచం స్పందించింది. తమీమ్ కుటుంబ సభ్యుల్లో మనో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేసింది. తమీమ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. నిన్ననే పుట్టిన రోజు జరుపుకున్న బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ తమీమ్ త్వరగా కోలుకోవాలని దేవుడిని వేడుకున్నాడు. తమీమ్ ఆరోగ్యం గురించి ప్రార్థనలు చేయాలని అభిమానులకు పిలుపునిచ్చాడు.
తమీమ్ పరిస్థితి తెలిసి టీమిండియా మాజీ ఆటగాడు, సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ కూడా స్పందించాడు. ఇంతకంటే కఠినమైన పరిస్థితులను మైదానంలో ఎదుర్కొన్నావు. విజయవంతమయ్యావు. ఇప్పుడూ అంతే, త్వరగా కోలుకుని విజయవంతంగా తిరిగొస్తావంటూ ట్వీట్ చేశాడు.
కాగా, తమీమ్ బంగ్లాదేశ్ తరఫున 16 ఏళ్ల కెరీర్‌లో 391 మ్యాచ్‌లు ఆడి 15000 పైచిలుకు పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చలామణి అవుతున్నాడు. తమీమ్ బంగ్లాదేశ్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కూడా రికార్డు కలిగి ఉన్నాడు. తమీమ్ తన అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తం 25 సెంచరీలు బాదాడు. తమీమ్ 2020-2023 మధ్యలో బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు.