యువ జోరు... | Football World Cup from tomorrow | Sakshi
Sakshi News home page

యువ జోరు...

Jun 10 2026 3:08 AM | Updated on Jun 10 2026 3:08 AM

Football World Cup from tomorrow

ప్రపంచకప్‌లో మెరిపించేందుకు టీనేజ్‌ స్టార్స్‌ రెడీ

రేపటి నుంచి ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌

నాలుగేళ్లకోసారి జరిగే ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో సత్తా చాటుకొని విశ్వవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాలని ఆయా జట్ల క్రీడాకారులు తాపత్రయపడుతుంటారు. ప్రతీ ప్రపంచకప్‌ కొందరిని హీరోలుగా చేస్తుంది. మరికొందరిని జీరోలుగా చేస్తుంది. ప్రపంచకప్‌ రూపంలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని రాత్రికి రాత్రే తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఎందరో యువ ఆటగాళ్లు సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం  సూపర్‌ స్టార్స్‌గా మారిన మెస్సీ, రొనాల్డో, నెమార్, ఎంబాపె, మోడ్రిచ్‌ తదితరులు ఈ దశను దాటి వచ్చినవాళ్లే. 

రేపటి నుంచి అమెరికా, కెనడా, మెక్సికోలలో మొదలయ్యే 23వ ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలోనూ పలువురు యువ ఆటగాళ్లు తమ విన్యాసాలతో అలరించేందుకు సై అంటున్నారు. ఈ జాబితాలో ముందువరుసలో ఉన్నాడు స్పెయిన్‌కు చెందిన 18 ఏళ్ల లామినె యామల్‌. రెండేళ్ల క్రితం యూరో టోర్నీలో స్పెయిన్‌కు నాలుగోసారి టైటిల్‌ దక్కడంలో యామల్‌ కీలకపాత్ర పోషించాడు. తాజా ప్రపంచకప్‌లో యామల్‌ మెరిపిస్తే స్పెయిన్‌ టైటిల్‌ ఫేవరెట్‌గా మారుతుందనడంలో సందేహం లేదు. 

డిఫెండర్లను బోల్తా కొట్టించడంలో... సహచరులకు సమయస్ఫూర్తితో పాస్‌లు అందించడంలో... సుదూరం నుంచి గోల్‌పోస్ట్‌ లక్ష్యంగా కళ్లు చెదిరే కిక్‌లు కొట్టడంలో యామల్‌కు తిరుగులేదు.  ఐదుసార్లు విజేత బ్రెజిల్‌ జట్టు తరఫున స్టార్‌ నెమార్‌ చివరిసారి ప్రపంచకప్‌లో ఆడుతుండగా... అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు సిద్ధమయ్యాడు 18 ఏళ్ల ఎస్టవో విలియన్‌. అభిమానులు ఇప్పటి నుంచే విలియన్‌ను ‘న్యూ నెమార్‌’గా పిలుస్తున్నారు. డిఫెన్స్‌ను ఛేదించి గోల్స్‌ కొట్టడంలో విలియన్‌కు మంచి పేరుంది. 

అర్జెంటీనా జట్టు కెప్టెన్‌ మెస్సీ రిటైరైనా ఆ జట్టు భవిష్యత్‌కు ఢోకా లేదని 18 ఏళ్ల ఫ్రాంకో మస్తాంటువానో తన ఆటతీరుతో భరోసా కల్పిస్తున్నాడు. వరుసగా రెండోసారి అర్జెంటీనా ప్రపంచకప్‌ టైటిల్‌ నెగ్గాలంటే మెస్సీతోపాటు ఫ్రాంకో ఆటతీరు కూడా కీలకం కానుంది. వరుసగా మూడోసారి ఫ్రాన్స్‌ జట్టు టైటిల్‌ పోరుకు అర్హత సాధించే అవకాశాలు సీనియర్‌ స్టార్స్‌ ఎంబాపె, డెంబెలె, 19 ఏళ్ల డిసిర్‌ డుయు ఆటతీరుపై ఆధారపడి ఉంది. 

ఇటీవల యూరో చాంపియన్స్‌ లీగ్‌ టైటిల్‌ నిలబెట్టుకున్న పీఎస్‌జీ జట్టుకు డిసిర్‌ డుయు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వీరితోపాటు గిల్బెర్టో మోరా (మెక్సికో), ఇబ్రహీం ఎంబాయె (సెనెగల్‌), నికో పాజ్‌ (అర్జెంటీనా), అర్దా లెర్‌ (టర్కీ), పౌ కుబార్స్‌ (స్పెయిన్‌), యాన్‌ డియోమండె (ఐవరీకోస్ట్‌), ఆండ్రీ సాంతోస్‌ (బ్రెజిల్‌), ఎండ్రిక్‌ (బ్రెజిల్‌), ఆంటోనియో నూసా (నార్వే) కూడా సంచలన ప్రదర్శనతో మెరిపించే అవకాశాలు ఉన్నాయి.        

– సాక్షి క్రీడా విభాగం

Advertisement
 
Advertisement
Advertisement