అనుకున్నది సాధించలేకపోయాం.. కారణం అదే: బాబర్‌ ఆజం | Far Behind USA In NRR, Babar Azam Explains Slow Approach Against Canada | Sakshi
Sakshi News home page

అనుకున్నది సాధించలేకపోయాం.. కారణం అదే: బాబర్‌ ఆజం

Published Wed, Jun 12 2024 10:48 AM | Last Updated on Wed, Jun 12 2024 11:02 AM

Far Behind USA In NRR Babar Azam Explains Slow Approach Against Canada

టీ20 ప్రపంచకప్‌-2024లో పాకిస్తాన్‌ జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. కెనడాతో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గట్టెక్కి ఊపిరి పీల్చుకుంది. ఏడు వికెట్ల తేడాతో ప్రత్యర్థిని ఓడించి సూపర్‌-8 ఆశలను సజీవం చేసుకుంది.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం తమ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే, రన్‌రేటు పరంగా వేగంగా లక్ష్యాన్ని ఛేదించాలని భావించినా.. పిచ్‌ స్వభావం కారణంగా వీలుపడలేదని విచారం వ్యక్తం చేశాడు.

గ్రూప్‌-ఏలో భాగమైన పాకిస్తాన్‌- కెనడాల మధ్య మంగళవారం రాత్రి మ్యాచ్‌ జరిగింది. న్యూయార్క్‌ వేదికగా టాస్‌ గెలిచిన పాక్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. కెనడా ఓపెనర్‌ ఆరోన్‌ జాన్సన్‌(44 బంతుల్లో 52) అర్థ శతకంతో మెరవగా.. మిగతా వాళ్లలో ఇద్దరు మినహా మిగతా వాళ్లంతా కనీసం పది పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయారు.

ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి కెనడా కేవలం 106 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాకిస్తాన్‌ బౌలర్లలో హ్యారిస్‌ రవూఫ్‌, ఆమిర్‌ రెండేసి వికెట్లు పడగొట్టగా.. షాహిన్‌ ఆఫ్రిది, నసీం షా ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.

ఇక లక్ష్యం చిన్నదే అయినా.. దానిని ఛేదించడానికి పాకిస్తాన్‌ కష్టపడాల్సి వచ్చింది. బ్యాటింగ్‌కు అంతగా అనుకూలించని పిచ్‌పై పాక్‌ బ్యాటర్లు ఆచితూచి ఆడుతూ వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు.

ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ హాఫ్‌ సెంచరీ(53 బంతుల్లో 53) చేయగా.. బాబర్‌ ఆజం(33 బంతుల్లో 33) పరుగులు చేశాడు. మిగత వాళ్లలో సయీమ్‌ ఆయుబ్‌ 6, ఫఖర్‌ జమాన్‌4, ఉస్మాన్‌ ఖాన్‌ 2(నాటౌట్‌) పరుగులు మాత్రమే చేయగలిగారు. ఈ క్రమంలో 17.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి పాక్‌ 107 పరుగులు చేయగలిగింది.

ఇక గ్రూప్‌-ఏలో ఉన్న పాక్‌ ఇప్పటికే వరుసగా యూఎస్‌ఏ, టీమిండియా చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే, తాజా విజయంతో పాక్‌ ఖాతాలో రెండు పాయింట్లు చేరినా.. యూఎస్‌ఏ(4 పాయింట్లు) కంటే వెనుకబడే ఉంది.

నిజానికి కెనడాతో మ్యాచ్‌లో పాక్‌ లక్ష్యాన్ని 14 ఓవర్లలోనే పూర్తి చేస్తే సూపర్‌-8 దశకు చేరే క్రమంలో యూఎస్‌ఏకు గట్టి పోటీ ఇచ్చి ఉండేది. ఇక పాక్‌ అవకాశాలు మెరుగుపడాలంటే తదుపరి ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో గెలవడంతో పాటు.. గ్రూప్‌-‘ఏ’లోని ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో కెనడాపై విజయానంతరం బాబర్‌ ఆజం మాట్లాడుతూ.. ‘‘మాకు ఈ గెలుపు అత్యసవరం. మా వాళ్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు.

తొలి ఆరు ఓవర్లలో మేము అనుకున్న లక్ష్యాన్ని సాధించాం. అయితే, యూఎస్‌ఏ కంటే నెట్‌ రన్‌రేటు పరంగా మెరుగుపడాలనే ఆలోచనతోనే ముందుకు సాగాము. నిజానికి 14 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించాల్సింది. కానీ పిచ్‌ అందుకు సహకరించలేదు’’ అని పేర్కొన్నాడు. తదుపరి మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శనతో టోర్నీలో ముందుసాగుతామని బాబర్‌ ఆజం ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

గ్రూప్‌-ఏ పాయింట్ల పట్టిక ఇలా..
ఇండియా- 2(ఆడినవి)-     2(గెలిచినవి) -   0(ఓడినవి) -   4(పాయింట్లు) -   +1.455(నెట్‌ రన్‌రేటు)
యూఎస్‌ఏ- 2(ఆడినవి)-    2(గెలిచినవి)0(ఓడినవి)-    4(పాయింట్లు)-    +0.626(నెట్‌ రన్‌రేటు)
పాకిస్తాన్‌- 3(ఆడినవి)-        1(గెలిచినవి)-    2(ఓడినవి)-    2(పాయింట్లు) -   +0.191(నెట్‌ రన్‌రేటు)
కెనడా- 3(ఆడినవి) -       1(గెలిచినవి)-    2(ఓడినవి)-    2(పాయింట్లు)-    -0.493(నెట్‌ రన్‌రేటు)
ఐర్లాండ్‌- 2(ఆడినవి)-    0(గెలిచినవి)-    2(ఓడినవి)-    0(పాయింట్లు)-    -1.712(నెట్‌ రన్‌రేటు)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement