
PC: X
ముక్కోణపు టీ20 సిరీస్‌లో పాకిస్తాన్ ఫైనల్ చేరింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పాక్ 31 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక ఈ ట్రై సిరీస్‌లో పాక్‌కు ఇది మూడో విజయం ఈ నేపథ్యంలో సల్మాన్ ఆఘా (Salman Agha) బృందం ఫైనల్‌కు అర్హత సాధించింది.
కాగా ఆసియా కప్ టీ20-2025 టోర్నమెంట్ సన్నాహకాల్లో భాగంగా యూఏఈ- అఫ్గనిస్తాన్- పాకిస్తాన్ త్రైపాక్షిక సిరీస్ ఆడుతున్నాయి. షార్జా వేదికగా జరగుతున్న ఈ ఏడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలుత అఫ్గనిస్తాన్‌ను ఓడించిన పాక్.. తర్వాత యూఏఈపై గెలిచింది. అనంతరం అఫ్గనిస్తాన్ చేతిలో ఓడిన పాక్.. తాజాగా యూఏఈతో రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది.
ఫఖర్ జమాన్ మెరుపు హాఫ్ సెంచరీ
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్లు షాహిబ్‌జాదా ఫర్హాన్ (16), సయీమ్ ఆయుబ్ (11) విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఫఖర్ జమాన్ (Fakhar Zaman) అద్భుత అర్ధ శతకంతో ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.
ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ 44 బంతులు ఎదుర్కొని.. పది ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 77 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఫఖర్ జమాన్‌కు తోడుగా మహమ్మద్ నవాజ్ (27 బంతుల్లో 37 నాటౌట్) వేగంగా ఆడాడు. దీంతో పాక్ మెరుగైన స్కోరు సాధించగలిగింది.
యూఏఈ బౌలర్లలో హైదర్ అలీ రెండు వికెట్లు తీయగా.. జునైద్ సిద్దిఖీ, ముహమ్మద్ రోషిద్ ఖాన్, ధ్రువ్ పరాశర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక పాక్ విధించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యూఏఈకి ఆదిలోనే దెబ్బ తగిలింది. కెప్టెన్, ఓపెనర్ ముహమ్మద్ వసీం (19)ను అబ్రార్ అహ్మద్ స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు పంపించాడు.
అలిశాన్ షరాఫూ అర్ధ శతకం వృథా
అయితే, మరో ఓపెనర్ అలిశాన్ షరాఫూ మాత్రం హాఫ్ సెంచరీతో రాణించాడు. 51 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 68 పరుగులు సాధించాడు. కానీ, పాక్ బౌలర్ల విజృంభణతో మిగతా బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో షరాఫూ అర్ధ శతకం వృథాగా పోయింది.
ఎథాన్ డిసౌజా (9), ఆసిఫ్ ఖాన్ (7), రాహుల్ చోప్రా (0), హర్షిత్ కౌశిక్ (3), జునైద్ సిద్దిఖీ ఇలా వచ్చి అలా వెళ్లగా.. ధ్రువ్ పరాశర్ (15 బంతుల్లో 18 నాటౌట్), హైదర్ అలీ (12- రనౌట్) డబుల్ డిజిట్ స్కోరు చేయగలిగారు.
ఈ క్రమంలో నిర్ణీత ఇరవై ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి యూఏఈ ఏడు వికెట్ల నష్టానికి 140 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా 31 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. పాక్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అబ్రార్ అహ్మద్ నాలుగు వికెట్లతో చెలరేగి.. పసికూనను వణికించాడు. ఇక షాహిన్ ఆఫ్రిది, మొహమ్మద్ నవాజ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
ఫైనల్‌లో అఫ్గన్‌తో పాక్ ఢీ
కాగా ఈ ముక్కోణపు సిరీస్‌లో యూఏఈ శుక్రవారం అఫ్గనిస్తాన్‌తో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. ఇక ఆదివారం పాకిస్తాన్- అఫ్గనిస్తాన్ ఫైనల్లో తలపడతాయి. ఇదిలా ఉంటే.. యూఏఈ వేదికగా సెప్టెంబరు 9- 28 వరకు ఆసియా కప్-2025 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన సంగతి తెలిసిందే.
చదవండి: గంభీర్, సెహ్వాగ్, భజ్జీ.. అంతా బాధితులే: ధోనిపై మరోసారి యువీ తండ్రి ఫైర్