
మొదటిరోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి టీమిండియా 204 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ 52(98), వాషింగ్టన్ సుందర్ 19(45) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ , గస్ అట్కిన్సన్ చెరో రెండు వికెట్లు సాధించగా క్రిస్ వోక్స్ ఒక వికెట్ పడగొట్టాడు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్ట్‌లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. వర్షం అంతరాయాల నడుమ సాగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 123 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, శుభ్‌మన్ గిల్ 21, రవీంద్ర జడేజా 9 పరుగులకు ఔట్ కాగా.. కరుణ్ నాయర్ (9), ధ్రువ్ జురెల్ (0) క్రీజ్‌లో ఉన్నారు.
ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 2, క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్ తలో వికెట్ తీయగా.. శుభ్‌మన్ గిల్ రనౌటయ్యాడు. ప్రస్తుతం ఔటైన వారంతా మంచి ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లే. కొత్తగా జట్టులోకి వచ్చిన ధ్రువ్, ఈ సిరీస్‌లోనే ఆరు ఇన్నింగ్స్‌ల్లో దారుణంగా విఫలమైన కరుణ్ నాయర్ టీమిండియాను ఏమేరకు ఆదుకుంటారో చూడాలి. వీరిద్దరి తర్వాత గత మ్యాచ్ సెంచరీ హీరో వాషింగ్టన్ సుందర్‌పైనే టీమిండియా ఆశలన్నీ ఉన్నాయి. వీరే టీమిండియాను గట్టెక్కించాలి.
కాగా, ఈ మ్యాచ్ కోసం భారత్, ఇంగ్లండ్ జట్లు చెరో నాలుగు మార్పులు చేశాయి. భారత్ తరఫున రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, అన్షుల్ కంబోజ్ స్థానాల్లో ధ్రువ్ జురెల్, కరుణ్ నాయర్, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాశ్‌దీప్ తుది జట్టులోకి రాగా.. ఇంగ్లండ్ తరఫున బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్ స్థానాల్లో జేకబ్ బేతెల్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్, జేమీ ఓవర్టన్ ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి వచ్చారు.
ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్ సిరీస్‌ను సమం చేసుకోగలుగుతుంది. ఓడినా, డ్రా అయినా ఇంగ్లండే సిరీస్ ఎగరేసుకుపోతుంది.
తుది జట్లు..
భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్), వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్
ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్(కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జామీ స్మిత్(వికెట్‌కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్