చివరిరోజు భారత షూటర్లకు రెండు పతకాలు
కైరో: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) జూనియర్ ప్రపంచకప్‌లో భారత జట్టు అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆదివారం ముగిసిన ఈ టోర్నిలో చివరిరోజు భారత షూటర్లు ఒక రజతం, ఒక కాంస్యంతో కలిపి రెండు పతకాలు సాధించారు. ఓవరాల్‌గా భారత షూటర్లు 5 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 16 పతకాలు సొంతం చేసుకొని ‘టాప్’ ర్యాంక్‌ను అందుకున్నారు. ఆఖరి రోజు పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో హేమంత్ బర్మన్ రజత పతకాన్ని నెగ్గాడు. హేమంత్ 351.7 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచాడు.
భారత్‌కే చెందిన వేదాంత్ నితిన్ వాఘ్మరే, రోహిత్ కన్యాన్ కూడా ఫైనల్లో పోటీపడినా పతకాలు సాధించలేకపోయారు. రోహిత్ 311.9 పాయింట్లతో ఆరో స్థానంలో, నితిన్ 300.5 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచారు. ట్రాప్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో జుహైర్ ఖాన్–ఆద్యా కత్యాల్ జోడీ భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది. జుహూర్–ఆద్యా ద్వయం 19 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో భారత షూటర్లు తేజల్, యుగేశ్వరి, అనుష్క, ఖ్వాయిష్ శర్మ ఫైనల్ చేరుకోవడంలో విఫలమయ్యారు.


