
దివ్య దేశ్‌ముఖ్ భావోద్వేగం
స్వస్థలంలో ఘన స్వాగతం
నాగ్‌పూర్: దివ్య దేశ్‌ముఖ్... ప్రస్తుత చెస్ సంచలనం. 19 ఏళ్ల వయసులో మహిళల ప్రపంచకప్‌ను గెలుచుకొని సత్తా చాటిన ఘనాపాటీ. జార్జియాలో జరిగిన ఫైనల్లో కోనేరు హంపిని ఓడించిన అనంతరం చాంపియన్‌గా నిలిచిన అనంతరం దివ్య బుధవారం రాత్రి స్వదేశానికి తిరిగి వచ్చింది. సొంత ఊరు నాగ్‌పూర్ విమానాశ్రయంలో ఆమె తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు, సన్నిహితులతో అంతా సందడిగా ఉంది. దివ్య రాగానే వారంతా బాజా భజంత్రీలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు.

అప్పుడే దివ్య తన వద్ద ఉన్న ఒక ఫోటో ఫ్రేమ్‌ను బయటకు తీసి ప్రదర్శించింది. అది ఆమె మొదటి కోచ్ రాహుల్ జోషి చిత్రం. దానిని చూపిస్తూ దివ్య భావోద్వేగానికి లోనైంది. చెస్‌లో రాహుల్ వద్దే దివ్య ఓనమాలు నేర్చుకుంది. కేవలం కోచ్‌గానే కాకుండా తన సొంత ఇంట్లో మనిషిగా చూస్తూ రాహుల్ ఆమెకు శిక్షణనందించాడు. కెరీర్ ఆరంభంలో అండర్–9 స్థాయి నుంచి అండర్–14 వరకు పలు విజయాలు రాహుల్ కోచ్‌గా ఉండగానే వచ్చాయి.
ఆమె మరింత ఎదుగుతున్న దశలో 2020లో కరోనా మహమ్మారి వచి్చంది. దీనికి 40 ఏళ్ల వయసులోనే జోషి బలయ్యాడు. కొన్ని విజయాలు సాధించగానే గతాన్ని మరిచిపోయే క్రీడాకారులు మనకు ఎంతో మంది కనిపిస్తుంటారు. కానీ ఆదిగురువును ఆమెకు గౌరవించిన తీరు దివ్యను ప్రత్యేకంగా చూపించింది. ‘నేను ఈ స్థాయికి చేరడంతో మొదటి కోచ్ రాహుల్ జోషి సర్ పాత్ర ఎంతో ఉంది. నేను గ్రాండ్‌మాస్టర్ కావాలని ఆయన ఎంతో కోరుకునేవారు. ఈ విజయం ఆయనకే అంకితం’ అని దివ్య తన మనసులో భావాన్ని వెల్లడించింది.
నా ఆటపైనే దృష్టి పెట్టాను...
హంపితో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తనపై ఎలాంటి ఒత్తిడీ లేదని, తాను ఓడినా కోల్పోయేదేమీ లేదనే ఆలోచనతోనే బరిలోకి దిగినట్లు దివ్య పేర్కొంది. ప్రత్యర్థికి ఎంతో అనుభవం ఉన్నా... దాని గురించి ఆందోళన చెందకుండా తన ఆటపైనే దృష్టి పెట్టానని ఆమె వెల్లడించింది. ‘నేను ఓడిపోతాననే ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు. నిజానికి హంపి చేసిన పెద్ద తప్పుతోనే విజయం నా సొంతమైంది. నేను వేయబోయే ఎత్తుల గురించే తప్ప తుది ఫలితం ఎలా వస్తుందని పట్టించుకోలేదు. కాబట్టి ఒత్తిడికి లోను కాలేదు.
అంతర్జాతీయ చెస్‌లో భారత మహిళలు సాధించే విజయాలు ఇక్కడ మరింత మంది అమ్మాయిలు ఈ ఆట వైపు ఆకర్షితులయ్యేందుకు స్ఫూర్తినిస్తాయి. అయితే నా ఉద్దేశం ప్రకారం తల్లిదండ్రుల మద్దతే అన్నింటికంటే అవసరం. ముఖ్యంగా విజయాలు సాధించినప్పుడు కాకుండా ఓటములు ఎదురైనప్పుడు కూడా అండగా నిలవాల్సి ఉంటుంది’ అని దివ్య అభిప్రాయ పడింది.
సెప్టెంబర్ లో తర్వాతి టోర్నీ...
ప్రపంచకప్‌ను గెలుచుకోవడంతో తనకు దక్కిన కొత్త గుర్తింపు పట్ల దివ్య దేశ్‌ముఖ్ సంతోషం వ్యక్తం చేసింది. మున్ముందు ఇలాంటి విజయాలను కొనసాగిస్తానని ఆమె ఆత్మవిశ్వాసంతో చెప్పింది. స్వస్థలం నాగపూర్‌లో లభించిన ఘన స్వాగతాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని దివ్య పేర్కొంది. ‘నా కోసం ఇంత మంది ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. వారంతా నన్ను సన్మానించిన తీరు చూస్తే గర్వంగా అనిపిస్తోంది. నాతో పాటు చెస్‌కు లభించిన గుర్తింపుగా దీనిని భావిస్తున్నాను.
తల్లిదండ్రులు నాకు అండగా నిలిచి ప్రోత్సహించడంతోనే ఇది సాధ్యమైంది. నా విజయంలో వారి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకొని మళ్లీ బరిలోకి దిగుతాను. సెపె్టంబర్ 2 నుంచి ఉజ్బెకిస్తాన్‌లో జరిగే గ్రాండ్ స్విస్ నా తర్వాతి టోర్నీ కానుంది’ అని దివ్య వెల్లడించింది. తాను వరల్డ్ కప్ గెలుచుకోవడంలో సహకరించిన మాజీ ఆటగాళ్లు, కోచ్‌లు అభిజిత్ కుంతే, అభిమన్యు పురాణిక్, సబా బలోగ్ (హంగేరీ)లకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.