పాపం పడిక్కల్‌.. వెంట్రుక వాసిలో సెంచరీ మిస్సయ్యాడు..! | Devdutt Padikkal Remains Not Out On 99 Vs Mangalore Dragons In Maharaja Trophy | Sakshi
Sakshi News home page

పాపం పడిక్కల్‌.. వెంట్రుక వాసిలో సెంచరీ మిస్సయ్యాడు..!

Aug 26 2025 6:00 PM | Updated on Aug 26 2025 7:26 PM

Devdutt Padikkal Remains Not Out On 99 Vs Mangalore Dragons In Maharaja Trophy

కర్ణాటకలో జరుగుతున్న మహారాజా ట్రోఫీలో ఆర్సీబీ ఆటగాడు దేవ్‌దత్‌ పడిక్కల్‌ చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో హుబ్లీ టైగర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా (11 మ్యాచ్‌ల్లో 439 పరుగులు, 5 అర్ద సెంచరీలు) కొనసాగుతున్న అతడు.. ఇవాళ (ఆగస్ట్‌ 26) మంగళూరు డ్రాగన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వెంట్రుక వాసిలో సెంచరీ చేజార్చుకున్నాడు. 

98 పరుగుల వద్ద పడిక్కల్‌కు సెంచరీ పూర్తి చేసుకునే అవకాశం​ వచ్చినప్పటికీ చేజార్చుకున్నాడు. 19వ ఓవర్‌ ఐదో బంతికి సింగిల్‌ మాత్రమే తీసి 99 పరుగుల వద్ద ఆగిపోయాడు. పడిక్కల్‌ ఆ బంతికి సింగిల్‌ తీయకుండా ఉండి, చివరి బంతిని ఎదుర్కొని ఉంటే సెంచరీ పూర్తి చేసకునే అవకాశం ఉండేది. అయితే సింగిల్‌తో సంతృప్తి చెందిన అతడు.. 99 పరుగుల వద్ద నాటౌట్‌గా నిలిచిపోయాడు. 

చివరి బంతిని ఎదుర్కొన్న మన్వంత్‌ కుమార్‌ సిక్సర్‌ బాది టైగర్స్‌ ఇన్నింగ్స్‌ను ముగించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 64 బంతులు ఎదుర్కొన్న పడిక్కల్‌ 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేశాడు. పడిక్కల్‌ రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన టైగర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. 

టైగర్స్‌ ఇన్నింగ్స్‌లో పడిక్కల్‌తో పాటు సన్‌రైజర్స్‌ ఆటగాడు అభినవ్‌ మనోహర్‌ కూడా చెలరేగాడు. మనోహర్‌ 23 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. పడిక్కల్‌తో పాటు ఓపెనర్‌గా బరిలోకి దిగిన మొహమ్మద్‌ తాహా 28 బంతుల్లో 37, మన్వంత్‌ కుమార్‌ 6 బంతుల్లో 16 పరుగులు చేశారు.మంగళూరు బౌలర్లలో రోనిత్‌ మోరే, క్రాంతి కుమార్‌ తలో వికెట్‌ తీశారు.

కాగా, ఐపీఎల్‌ 2025లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన పడిక్కల్‌ తొడ కండరాల సమస్య కారణంగా సీజన్‌ మధ్యలోనే వైదొలిగాడు. ఆ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన అతడు.. 150కి పైగా స్ట్రయిక్‌రేట్‌తో 247 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ద సెంచరీలు ఉన్నాయి. ఆ సీజన్‌లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరడంలో పడిక్కల్‌ కీలకపాత్ర పోషించాడు. పడిక్కల్‌ వైదొలగడంతో ఆర్సీబీ అతని స్థానాన్ని మరో కర్ణాటక ఆటగాడు మయాంక్‌ అగర్వాల్‌తో భర్తీ చేసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement