ఎవరిని నిందించొద్దు.. తప్పంతా నాదే : వార్నర్‌

David Warner Says Dont Blame Anyone Its My Responsibility Against KKR - Sakshi

అబుదాబి : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వరుసగా రెండో ఓటమి నమోదు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. కేన్‌ విలియమ్సన్‌ ఈ మ్యాచ్‌లోనూ ఆడకపోవడం.. మనీష్‌ పాండే మినహా మిగతావారు విఫలమవడంతో సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌లో పూర్తిగా ఫెయిలయ్యింది. ఇదే విషయమై మ్యాచ్‌ అనంతరం సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ స్పందించాడు.

'ఈరోజు జరిగిన మ్యాచ్‌లో మా ప్రదర్శన అస్సలు బాగోలేదు. ఇన్నింగ్స్‌ ఆరంభంలో మంచి రన్‌రేట్‌ లభించినా దానిని చివరి వరకు కొనసాగించలేకపోయాం.అయితే ఈ మ్యాచ్‌లో నేను ఎవరిని నిందించదలచుకోలేను.. తప్పంతా నాదే కాబట్టి.. ఓటమి బాధ్యత కూడా నేనే తీసుకుంటా.  ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించాలన్న ధోరణితో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన నేను దానిని కాపాడుకోలేకపోయా.. వరుణ్‌ చక్రవర్తి వేసిన బంతిని అంచనా వేయలేక అనవసరంగా వికెట్‌ను ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇన్నింగ్స్‌లో పూర్తి ఓవర్లు ఆడి కేవలం నాలుగు వికెట్లే కోల్పోయినా.. జట్టు స్కోరు చూస్తే నామమాత్రంగానే ఉంది. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇంకా ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు బెంచ్‌ మీదే ఉన్నారు. (చదవండి : కేన్‌ విలియమ్సన్‌ అందుకే ఆడలేదా..)

16వ ఓవర్‌ తర్వాత బ్యాటింగ్‌లో వేగం పెంచి బౌలర్లపై ఒత్తిడి తెచ్చి ఉంటే మంచి స్కోరు సాధించేవాళ్లం. కానీ జట్టులో సరైన హిట్టర్లు లేకపోవడం దురదృష్టం. అంతేగాక కోల్‌కతాతో మ్యాచ్‌లో డాట్‌బాల్స్‌ ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 35- 36 బంతులు డాట్‌బాల్స్‌ ఉన్నాయి. టీ20 క్రికెట్‌లో ఇన్ని డాట్‌బాల్స్‌ ఉండడం ఎవరు ఒప్పుకోరు. ఈ విషయం నన్ను చాలా బాధించింది. తర్వాత ఆడబోయే మ్యాచ్‌ల్లో మా మైండ్‌సెట్‌ మార్చుకొని బరిలోకి దిగుతాం. దుబాయ్‌లో బౌండరీలు కొట్టడం చాలా కష్టంగా ఉంది. ఇండియాతో పోలిస్తే ఇక్కడి మైదానాల్లో బౌండరీలు చాలా దూరంలో ఉన్నాయి. దీంతో బౌండరీలు బాదే విషయంలో మాకు మరింత ప్రాక్టీస్‌ కావాల్సి ఉంది.'అని తెలిపాడు. (చదవండి : 'ఆర్చర్‌ రెడీగా ఉండు .. తేల్చుకుందాం')

కేకేఆర్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ మొత్తం సాదాసీదాగా సాగింది జానీ బెయిర్‌ స్టోతో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన వార్నర్‌తో పాటు ఒక్క బ్యాట్స్‌మన్‌ కూడా కావాల్సినంత దూకుడును ప్రదర్శించలేకపోయాడు. కోల్‌కతా పదునైన బౌలింగ్‌ కూడా అందుకు కారణంగా చెప్పవచ్చు. నరైన్‌ ఓవర్లో వార్నర్‌ ఒక సిక్స్, ఫోర్‌ కొట్టినా... తర్వాతి ఓవర్లోనే కమిన్స్‌ చక్కటి బంతితో బెయిర్‌స్టో (5)ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. పుట్టినరోజునాడు బెయిర్‌స్టోకు మైదానంలో కలిసి రాలేదు. ఆ తర్వాత కూడా కేకేఆర్‌ బౌలర్లు ప్రత్యర్థిపై బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడిని కొనసాగించారు.

వరుణ్‌ చక్రవర్తి వేసిన తొలి బంతినే అర్థం చేసుకోవడంలో తడబడి వార్నర్‌ రిటర్న్‌ క్యాచ్‌ ఇవ్వడంతో రైజర్స్‌ కీలక వికెట్‌ కోల్పోయింది. మనీష్‌ పాండే అర్థసెంచరీతో మెరిసినా... సరైన హిట్టింగ్‌ చేసేవారే కరువయ్యారు. దీంతో సన్‌రైజర్స్‌ నామమాత్రపు స్కోరుకే పరిమితమయింది. అయితే గతంలో తక్కువ స్కోర్లు నమోదు చేసినా బౌలర్ల బలంతో గెలిచే ఎస్‌ఆర్‌హెచ్‌ ఈ మ్యాచ్‌లో మాత్రం ఏం చేయలేకపోయింది. శుభమన్‌ గిల్‌ అద్భుత బ్యాటింగ్‌.. మోర్గాన్‌ దూకుడు ఇన్నింగ్స్‌ ముందు సన్‌రైజర్స్‌ బౌలర్లంతా తేలిపోయారు. కాగా సన్‌రైజర్స్‌ తన తర్వాతి మ్యాచ్‌ సెప్టెంబర్‌ 29న ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఎదుర్కోనుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top