
ఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా ప్రైవేట్ టీ20 లీగ్‌ల్లో సత్తా చాటుతూనే ఉన్నాడు. వయసు మీద పడుతున్నా (38) వార్నర్‌లో జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న హండ్రెడ్ లీగ్ ఆడుతున్న వార్నర్ (లండన్ స్పిరిట్).. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు (70 నాటౌట్, 71) బాదాడు.
మాంచెస్టర్ ఒరిజినల్స్‌పై 71 పరుగుల ఇన్నింగ్స్ అనంతరం వార్నర్ పొట్టి క్రికెట్‌లో ఓ ఘనత సాధించాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లిని వెనక్కు నెట్టి టాప్-5లోకి (ఐదో స్థానం) చేరాడు.
కోహ్లి తన టీ20 కెరీర్‌లో 414 మ్యాచ్‌ల్లో 13543 పరుగులు చేయగా.. వార్నర్ 419 మ్యాచ్‌ల్లో 13545 పరుగులు చేసి కోహ్లిని అధిగమించాడు. హండ్రెడ్ లీగ్‌లో వార్నర్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకే అవకాశం ఉంది.
ఈ జాబితాలో క్రిస్ గేల్ 14562 పరుగులతో (463 మ్యాచ్‌లు) అగ్రస్థానంలో ఉండగా.. కీరన్ పోలార్డ్, అలెక్స్ హేల్స్, షోయబ్ మాలిక్ రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.
వార్నర్‌కు పోలార్డ్ స్థానానికి చేరుకోవడానికి 309 పరుగులు.. హేల్స్ స్థానానికి చేరుకోవడానికి 269 పరుగులు, షోయబ్ మాలిక్ స్థానానికి చేరుకోవడానికి కేవలం 16 పరుగులు మాత్రమే కావాలి. హండ్రెడ్ లీగ్‌లో మరో మ్యాచ్‌లోనే వార్నర్ షోయబ్ మాలిక్ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది.
కాగా, ఇటీవలికాలంలో పేలవ ప్రదర్శనలు చేసిన వార్నర్.. హండ్రెడ్ లీగ్‌తోనే తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. దీనికి ముందు జరిగిన మేజర్ లీగ్ క్రికెట్‌లో వార్నర్ 6 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 114 పరుగులు మాత్రమే చేశాడు.
హండ్రెడ్‌లో వార్నర్ రాణిస్తున్నా అతని జట్టు లండన్ స్పిరిట్ మాత్రం మెరుగైన ప్రదర్శనలు చేయలేకపోతుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచింది. ఆ మ్యాచ్‌లో కూడా డేవిడ్ వార్నరే (70 నాటౌట్) ఆ జట్టును విజయతీరాలకు చేర్చాడు.