
సిన్సినాటి (ఒహాయో): గత నెల టెన్నిస్ సర్క్యూట్‌లోకి పునరాగమనం చేసిన అమెరికన్ దిగ్గజం వీనస్ విలియమ్స్‌కు సిన్సినాటి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టోర్నీలో చుక్కెదురైంది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఆమె 4–6, 4–6తో స్పెయిన్‌కు చెందిన బౌజస్ మనీరో చేతిలో వరుస సెట్లలో పరాజయం చవిచూసింది.
ఈ ఏడాది ఆఖరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో బరిలోకి దిగేందుకు సిద్ధమైన వీనస్ సన్నాహకంగా ఈ హార్డ్‌కోర్ట్ టెన్నిస్ టోర్నీలో ఆడింది. 7 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లు, 14 డబుల్స్ టైటిళ్లు నెగ్గిన అమెరికన్ వెటరన్ స్టార్‌కు స్వదేశంలోని యూఎస్ ఓపెన్ నిర్వాహకులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. 45 ఏళ్ల అమెరికన్ నాలుగు (వింబుల్డన్–2000, 2001; యూఎస్ ఓపెన్ 2000, 2001) గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచేనాటికి బౌజస్ మనీరో పుట్టనేలేదు.
తాజాగా 51 ర్యాంకర్ మనీరో వరుస సెట్లలోనే ఓ దిగ్గజ ప్లేయర్‌కు ఇంటిదారి చూపింది. మ్యాచ్ ముగిసిన తర్వాత 22 ఏళ్ల స్పెయిన్ అమ్మాయి నిజంగానే అద్భుతంగా ఆడిందని వీనస్ కితాబు ఇచ్చింది. సిన్సినాటిలో ఆమె బరిలోకి దిగడం ఇది 11వ సారి!
టైటిల్ గెలవనప్పటికీ 2012లో సెమీస్, 2019లో క్వార్టర్స్ చేరింది. ఈ నెల 19 నుంచి జరిగే యూఎస్ ఓపెన్‌లో వీనస్ సింగిల్స్‌తో పాటు మిక్స్‌డ్ డబుల్స్ బరిలోనూ దిగుతోంది. మిక్స్‌డ్‌లో సహచర క్రీడాకారుడు రీలి ఒపెల్కాతో జతకట్టింది.
సూపర్ షెల్టన్
టొరంటో: అమెరికా రైజింగ్ టెన్నిస్ స్టార్ బెన్ షెల్టన్ తన కెరీర్‌లోనే గొప్ప టైటిల్ సాధించాడు. నేషనల్ బ్యాంక్ ఓపెన్ టొరంటో ఏటీపీ మాస్టర్స్–1000 టోరీ్నలో ప్రపంచ ఆరో ర్యాంకర్ షెల్టన్ విజేతగా నిలిచాడు.
ఫైనల్లో షెల్టన్ 6–7 (5/7), 6–4, 7–6 (7/3)తో ప్రపంచ 12వ ర్యాంకర్ కరెన్ ఖచనోవ్ (రష్యా)పై విజయం సాధించాడు. 2 గంటల 47 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో షెల్టన్ 16 ఏస్‌లు సంధించి, 6 డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. విజేత షెల్టన్‌కు 11,24,380 డాలర్ల (రూ. 9 కోట్ల 84 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.