
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో గాయపడి ఆటకు దూరమైన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) తిరిగి మైదానంలోకి అడుగు పెడుతున్నాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో అక్టోబరు 30 నుంచి నవంబర్ 9 వరకు జరిగే రెండు నాలుగు రోజుల (ఫస్ట్‌క్లాస్) అనధికారిక టెస్టు మ్యాచ్‌లలో తలపడే భారత ‘ఎ’ జట్టుకు పంత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.
బెంగళూరు వేదికగా జరిగే ఈ రెండు మ్యాచ్‌ల కోసం రెండు వేర్వేరు జట్లను మంగళవారం సెలక్టర్లు ప్రకటించారు. అయితే, ఇందులో ముంబై స్టార్ సర్ఫరాజ్ ఖాన్ (Sarfraz Khan)కు చోటు దక్కలేదు. కాగా స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌లలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ను ఆడిస్తామని సెలక్టర్లు నమ్మకంగానే అతడికి చెప్పినట్లు సమాచారం.
పదిహేడు కిలోల మేర బరువు తగ్గి..
ఈ నేపథ్యంలో టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న వేళ సర్ఫరాజ్ ఖాన్ ఫిట్‌నెస్‌పై మరింతగా దృష్టి సారించాడు. ఏకంగా పదిహేడు కిలోల మేర బరువు తగ్గి స్లిమ్‌గా మారాడు. అయితే, సెలక్టర్లను మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.
సొంతగడ్డపై సౌతాఫ్రికాతో టెస్టులకు ముందు జరిగే అనధికారిక టెస్టు సిరీస్‌కు సెలక్టర్లు సర్ఫరాజ్‌ను ఎంపిక చేయలేదు. ఇందుకు ప్రధాన కారణం అతడి బ్యాటింగ్ ఆర్డరే అని తెలుస్తోంది. సాధారణంగా ముంబై జట్టులో సర్ఫరాజ్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు.
పంత్ రాకతో
అయితే, భారత- ‘ఎ’ జట్టు కెప్టెన్‌గా తిరిగి వచ్చిన పంత్ కూడా అదే స్థానంలో ఆడతాడన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ టాపార్డర్‌కు ప్రమోట్ అవుదామనుకున్నా.. ఓపెనర్లుగా ఆయుశ్ మాత్రే- నారాయణ్ జగదీశన్ వచ్చే అవకాశం ఉండగా.. వన్‌డౌన్‌లో వైస్ కెప్టెన్ సాయి సుదర్శన్ ఉండనే ఉన్నాడు.
ఇక ఆ తర్వాతి స్థానం కోసం దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ పోటీపడుతున్నారు. ఇక మిడిలార్డర్‌లో ఐదో నంబర్‌లో పంత్ ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో సర్ఫరాజ్ బ్యాటింగ్ చేసే అవకాశం లేదు. ఇక టీమిండియాలోనూ ఆరో స్థానం నుంచి ఆల్‌రౌండర్లే ప్రధానంగా బ్యాటింగ్‌కు వస్తున్నారు.
బ్యాటింగ్ ఆర్డర్ గురించి చర్చించాలి
ఇలాంటి సమీకరణల నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్‌కు ‘ఎ’ జట్టులోనూ చోటు కరువైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతడి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఒకరు పీటీఐతో మాట్లాడుతూ..
‘‘ముంబై మేనేజ్‌మెంట్‌తో సర్ఫరాజ్ ఖాన్ తన బ్యాటింగ్ ఆర్డర్ గురించి చర్చించాలి. లేదంటే.. సీనియర్ ప్లేయర్ అజింక్య రహానేతో మాట్లాడాలి. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి కొత్త బంతిని ఎదుర్కునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.
చాలానే ఆప్షన్లు ఉన్నాయి
వన్‌డౌన్‌లో నిలదొక్కుకుంటే భవిష్యత్తులోనైనా అవకాశాలు వస్తాయి. అలా కాకుండా ఐదు లేదంటే ఆరో స్థానంలో ఆడతానంటే సర్ఫరాజ్ కెరీర్ ప్రశ్నార్థకమే అవుతుంది. ఎందుకంటే.. ఐదో స్థానంలో పంత్‌తో పాటు.. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, నితీశ్ రెడ్డి రూపంలో మేనేజ్‌మెంట్‌కు చాలానే ఆప్షన్లు ఉన్నాయి.
ఈ ముగ్గురు ఫిట్‌గా ఉండి.. సెలక్షన్‌కు అందుబాటులో ఉంటే సర్ఫరాజ్ ఖాన్‌కు మొండిచేయి తప్పదు. ఒకవేళ పంత్ గాయపడినా ధ్రువ్ జురెల్ ఐదు లేదంటే ఆరో స్థానంలో ఆడతాడు. కాబట్టి సర్ఫరాజ్ మూడో స్థానంలో ఆడటంపై దృష్టి పెడితే బాగుంటుంది’’ అని సదరు సెలక్టర్ అభిప్రాయపడ్డాడు.
కాగా ముంబై తరఫున రంజీల్లో పరుగుల వరద పారించిన 28 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్.. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు ఆరు టెస్టులు ఆడి 371 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, మూడు అర్ధ శతకాలు ఉన్నాయి.
చదవండి: సౌతాఫ్రికాతో సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రిషభ్ పంత్