
పాకిస్తాన్ వన్డే కెప్టెన్‌గా మొహమ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan)ను తప్పించడానికి గల కారణాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డ్రెసింగ్ రూమ్‌లో మతపరమైన విషయాలను రిజ్వాన్ ఎక్కువగా చర్చిస్తున్నాడని.. అందుకే అతడిపై వేటు పడి ఉండవచ్చని మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ అభిప్రాయపడ్డాడు.
ఇలాంటివి జట్టుకు మేలు చేయవని భావించిన కోచ్ మైక్ హసన్ రిజ్వాన్‌కు ఉద్వాసన పలకాలనే ఉద్దేశంతోనే బోర్డును ఒత్తిడి చేశాడని లతీఫ్ ఆరోపించాడు. అయితే, తాజాగా రిజ్వాన్ తొలగింపునకు గల ప్రధాన కారణం ఇదేనంటూ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఇచ్చిన కథనం వెలుగులోకి వచ్చింది.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇంటా బయటా పరాజయాలతో సతమతమవుతున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు... వన్డే కెప్టెన్‌ను మార్చిన విషయం తెలిసిందే.
షాహీన్ షా అఫ్రిదికి పగ్గాలు
వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ నుంచి సారథ్య బాధ్యతలు తప్పించి... స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది (Shaheen Shah Afridi)కి కట్టబెట్టింది. ప్రస్తుతం సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడుతున్న పాకిస్తాన్ జట్టు... నవంబర్ 4 నుంచి 8 మధ్య సఫారీ జట్టుతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది.
వచ్చే నెల నుంచి షాహీన్ అఫ్రిది జట్టు పగ్గాలు చేపట్టనున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మంగళవారం వెల్లడించింది. ఇస్లామాబాద్ వేదికగా జరిగిన సమావేశంలో జాతీయ సెలెక్టర్లు, అడ్వైజరీ బోర్డు సభ్యులు, హెడ్ కోచ్ మైక్ హసన్ చర్చించిన అనంతరం ఈ కెప్టెన్సీ మార్పు జరిగింది. అయితే సారథ్య మార్పునకు గల కారణాన్ని మాత్రం బోర్డు వెల్లడించలేదు.
రిజ్వాన్ సారథ్యంలో కీలక విజయాలు..
గతంలో టీ20 కెప్టెన్‌గా వ్యవహరించిన 25 ఏళ్ల షాహీన్... పాకిస్తాన్ జాతీయ జట్టు తరఫున 66 వన్డేలు, 92 టీ20లు, 32 టెస్టులు ఆడాడు. మొహమ్మద్ రిజ్వాన్ సారథ్యంలో ఆడిన 20 వన్డేల్లో పాకిస్తాన్ జట్టు 9 విజయాలు సాధించి మరో 11 మ్యాచ్‌ల్లో ఓడింది. ఆస్ట్రేలియా, జింబాబ్వే, దక్షిణాఫ్రికాలో రిజ్వాన్ సారథ్యంలోని పాకిస్తాన్ జట్టు వన్డే సిరీస్‌లు గెలిచింది.
అయితే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో మాత్రం పేలవ ప్రదర్శన కనబర్చింది. ముఖ్యంగా రిజ్వాన్ కెప్టెన్సీలో ఆటకంటే ఆధ్యాత్మిక చర్చ ఎక్కువైపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. దానికి తోడు హెడ్ కోచ్ పట్టుబట్టడంతోనే కెప్టెన్సీ మార్పు జరిగినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రోజుకు ఐదుసార్లు
ఈ నేపథ్యంలో పీటీఐ కథనం ఆసక్తికరంగా మారింది. ‘‘క్రికెట్‌లో రిజ్వాన్ మతపరమైన విషయాలను తీసుకువస్తున్నాడని బోర్డు పెద్దలు భావించారు. ఇది కొంతమంది ప్లేయర్లకు అసౌకర్యం కలిగించింది. రిజ్వాన్ తన మతపరమైన విశ్వాసాలను మీడియా ముఖంగానూ వెల్లడించడంలో సంశయించడు.
పాకిస్తాన్ బ్యాటర్ ఇమామ్-ఉల్-హక్ చెప్పిన వివరాల ప్రకారం.. రిజ్వాన్.. జట్టు బస చేసే హోటళ్లలో ప్రత్యేకంగా సెషన్లు ఏర్పాటు చేసి మరీ.. రోజుకు ఐదుసార్లు ప్రార్థన చేయాలనే నియమం పెట్టాడు’’ అని పీటీఐ కథనం పేర్కొంది.
సరోగేట్ యాడ్స్‌కు అతడు వ్యతిరేకం!
అయితే, పీసీబీ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ఇందుకు భిన్నమైన వాదన వినిపించాయి. ‘‘బెట్టింగ్ కంపెనీలను ప్రమోట్ చేయలేనని రిజ్వాన్ పీసీబీకి చెప్పాడు. బెట్టింగ్ సంస్థల కోసం పీసీబీ చేసే సరోగేట్ యాడ్స్‌కు అతడు వ్యతిరేకం. అందుకే అతడిపై వేటు వేశారు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.
చదవండి: IND vs AUS: 244 పరుగులు.. 83.84 స్ట్రైక్ రేటు! అడిలైడ్‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లి