
టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి(Virat Kohli) తమ అంతర్జాతీయ క్రికెట్ రీ ఎంట్రీ మ్యాచ్‌లో నిరాశపరిచిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడు నెలల తర్వాత భారత్ తరపున ఆడిన ఈ సీనియర్ ద్వయం ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో రోహిత్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔట్ కాగా.. కోహ్లి డకౌట్‌గా వెనుదిరిగారు.
బౌన్స్ అండ్ ఫాస్ట్ పెర్త్ పిచ్‌పై ఆసీస్ బౌలర్లను ఎదుర్కొవడానికి వీరిద్దరూ ఇబ్బంది పడ్డారు. హిట్‌మ్యాన్ జోష్ హాజిల్ వుడ్ బౌలింగ్‌లో ఓ బౌన్సర్ బంతికి దొరికి పోగా.. స్టార్క్ బౌలింగ్‌లో డ్రైవ్ ఆడేందుకు ప్రయత్నించి ఔటయ్యాడు. ఇక ఆడిలైడ్ వేదికగా జరగనున్న రెండో వన్డేలో అందరి కళ్లుపై వీరిద్దరి పైనే ఉన్నాయి. తొలి వన్డేలో విఫలమైన రో-కో అడిలైడ్‌లోనైనా రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ఆడిలైడ్ ఓవల్‌లో రోహిత్, కోహ్లి ట్రాక్ రికార్డు ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.
కోహ్లి రికార్డు అదుర్స్..
ఈ మైదానంలో కోహ్లికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు నాలుగు వన్డేలు ఆడిన కోహ్లి.. 61.00 సగటుతో 244 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ఈ మైదానంలో అతడు చివరగా 2019లో ఆడాడు. అయితే ఈ ఓవల్ స్టేడియంలోని పిచ్ తొలుత ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించినప్పటికి.. నెమ్మదిగా స్పిన్నర్లు గేమ్‌లోకి వస్తారు.
కాబట్టి ఈ మ్యాచ్‌లో కోహ్లి సత్తాచాటే అవకాశముంది. ఈ ఓవల్ మైదానంలో కోహ్లికి టెస్టుల్లో కూడా మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 5 టెస్టులు ఆడిన కింగ్ కోహ్లి.. 52.70 సగటుతో 527 పరుగులు చేశాడు. ఈ చారిత్రత్మక మైదానంలో అతడి పేరిట మూడు టెస్టు సెంచరీలు ఉన్నాయి.
రోహిత్.. నో హిట్
అయితే ఈ మైదానంలో గత రికార్డులు రోహిత్ శర్మను భయపెడుతున్నాయి. అడిలైడ్‌లో హిట్‌మ్యాన్ ట్రాక్ రికార్డు అస్సలు బాగోలేదు. ఇప్పటివరకు ఈ మైదానంలో 6 వన్డేలు ఆడిన ఈ మాజీ కెప్టెన్.. 21.83 సగటుతో కేవలం 131 పరుగులు మాత్రమే చేశాడు. ఇక్కడ అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 44గా ఉంది. టెస్టుల్లో కూడా రోహిత్ తన మార్క్‌ను చూపించలేకపోయాడు.
చదవండి: 352 వికెట్లు.. 10,470 రన్స్.. కట్ చేస్తే! రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా క్రికెటర్