అతడి పని పట్టాలంటే బుమ్రా తర్వాతే ఎవరైనా!.. మైండ్‌ బ్లాంక్‌ అయ్యేలా! | Bumrah Creates History Breaks Huge Record Becomes 1st Player In World To | Sakshi
Sakshi News home page

అతడి పని పట్టాలంటే బుమ్రా తర్వాతే ఎవరైనా!.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..

Jul 11 2025 7:39 PM | Updated on Jul 11 2025 8:12 PM

Bumrah Creates History Breaks Huge Record Becomes 1st Player In World To

ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో భారత ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తన పేస్‌ పదునుతో ఆతిథ్య జట్టు బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఏకంగా ఐదు వికెట్లు కూల్చి ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు.

ఈ క్రమంలో లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్‌ (Lord's)మైదానంలో తన తొలి ఫైవ్‌ వికెట్‌ హాల్‌ నమోదు చేశాడు. కాగా లార్డ్స్‌ టెస్టులో వరల్డ్‌ నంబర్‌ వన్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ (11)ను అవుట్‌ చేయడం ద్వారా వికెట్ల వేట మొదలుపెట్టిన బుమ్రా.. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో ఆది నుంచే తన ప్రతాపం చూపించాడు.

తొలుత ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (44)ను పెవిలియన్‌కు పంపిన బుమ్రా.. సెంచరీ వీరుడు జో రూట్‌ (104)ను అద్భుత రీతిలో బౌల్డ్‌ చేశాడు. అనంతరం ఈ రైటార్మ్‌ పేసర్‌.. క్రిస్‌ వోక్స్‌ (0), జోఫ్రా ఆర్చర్‌ (4) వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.  

పదిహేనోసారి
కాగా టెస్టుల్లో జో రూట్‌ను బుమ్రా అవుట్‌ చేయడం ఇది పదకొండోసారి కావడం విశేషం. అదే విధంగా.. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో రూట్‌ను ఈ పేస్‌ గుర్రం వెనక్కిపంపడం పదిహేనోసారి. 

వన్డేల్లో మూడు, టీ20లలో రెండుసార్లు బుమ్రా ఈ పని చేశాడు. తద్వారా.. యాక్టివ్‌ ‘ఫ్యాబ్‌ ఫోర్‌(కోహ్లి, స్మిత్‌, రూట్‌, విలియమ్సన్‌)’లో ఒకడైన రూట్‌ను అత్యధికసార్లు పెవిలియన్‌కు పంపిన తొలి బౌలర్‌గా బుమ్రా అరుదైన ఘనత సాధించాడు.

ఈ మేరకు ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ బౌలర్‌కూ సాధ్యం కాని ఫీట్‌ నమోదు చేశాడు. మరోవైపు.. ఆస్ట్రేలియా కెప్టెన్‌, స్టార్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ జో రూట్‌ను ఇప్పటికి 14సార్లు అవుట్‌ చేశాడు. టెస్టుల్లో బుమ్రాతో కలిపి 11సార్లు రూట్‌ను వెనక్కిపంపిన కమిన్స్‌.. వన్డేల్లో మూడుసార్లు అతడిని అవుట్‌ చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో జో రూట్‌ను అత్యధికసార్లు అవుట్‌ చేసిన బౌలర్లు వీరే
🏏జస్‌ప్రీత్‌ బుమ్రా (ఇండియా)- 15 సార్లు
🏏ప్యాట్‌ కమిన్స్‌ (ఆస్ట్రేలియా)​- 14 సార్లు
🏏జోష్‌ హాజిల్‌వుడ్‌ (ఆస్ట్రేలియా)​- 13 సార్లు
🏏రవీంద్ర జడేజా (ఇండియా)- 13 సార్లు
🏏ట్రెంట్‌ బౌల్ట్‌ (న్యూజిలాండ్‌)- 12 సార్లు.

ఇదిలా ఉంటే.. లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. బుమ్రా ఐదు వికెట్లు కూల్చగా.. నితీశ్‌ కుమార్‌ రెడ్డి, మహ్మద్‌ సిరాజ్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజాకు ఒక వికెట్‌ దక్కింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో రూట్‌ (104) సెంచరీ చేయగా.. జేమీ స్మిత్‌ (51), బ్రైడన్‌ కార్స్‌ (56) అర్ధ శతకాలతో రాణించారు.

చదవండి: IND vs ENG 3rd Test: అంపైర్‌పై గిల్‌, సిరాజ్‌ అసహనం!.. గావస్కర్‌ వ్యంగ్యాస్త్రాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement