టర్కీ భూకంప బాధిత చిన్నారుల కోసం ఫుట్‌బాల్‌ ప్రేమికులు ఏం చేశారో చూడండి..!

Besiktas Fans Throw Toys On Football Pitch For Children Affected By Earthquakes In Turkey - Sakshi

ఈ ఏడాది ఫిబ్రవరి 6న టర్కీ దేశాన్ని భారీ భూకంపం (రిక్టర్‌ స్కేలుపై 7.8 మ్యాగ్నిట్యూడ్‌)  అతలాకుతలం చేసిన విషయం విధితమే. ఈ మహా విలయంలో దాదాపు 50000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. చనిపోయిన వారిలో మహిళలు, వృద్దులు, చిన్న పిల్లలు అధిక సంఖ్యలో ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఘనా స్టార్‌ ఫుట్‌బాలర్‌, న్యూకాస్టిల్‌ వింగర్‌ క్రిస్టియన్‌ అట్సూ కూడా ఉన్నాడు. ఈ భారీ భూకంపం టర్కీతో పాటు సిరియా దేశంపై కూడా విరుచుకుపడింది. భూకంపం తెల్లవారు జామున 4:17 గంటల సమయంలో రావడంతో ప్రాణ నష్టం అధికంగా జరిగింది.

ఇదిలా ఉంటే, టర్కీ సూపర్‌ లీగ్‌లో భాగంగా ఫిబ్రవరి 26న అంటాల్యాస్పోర్‌-బెసిక్టాస్‌ క్లబ్‌ల మధ్య జరిగిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ సందర్భంగా బెసిక్టాస్‌ అభిమానులు తమ మానవతా దృక్పథాన్ని వినూత్న రీతిలో చాటుకున్నారు. ఈ మ్యాచ్‌ జరుగుతుండగా స్టేడియంలోని బెసిక్టాస్‌ అభిమానులు టర్కీ, సిరియా భూకంప బాధిత చిన్నారుల కోసం ఖరీదైన బొమ్మలు, గిఫ్ట్‌లు, కండువాలను మైదానంలోకి విసిరారు.

ఊహించని విధంగా ఇలా జరగడంతో లీగ్‌ నిర్వహకులు మ్యాచ్‌ను కాసేపు (4 నిమిషాల 17 సెకెన్ల పాటు) నిలిపివేసి దాతలను ఎంకరేజ్‌ చేశారు. ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. చిన్న పిల్లల కోసం బెసిక్టాస్‌ అభిమానులు చేసిన వినూత్న సాయం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారి దాతృత్వ హృదయాలకు జనం సలాం కొడుతున్నారు.  
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top