
ఐపీఎల్-2025 సీజన్ నిరావధికంగా వాయిదా పడడంతో భారత జట్టు ఇక ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు సన్నద్దం కానుంది. ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్ పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టు భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది.
ఈ క్రమంలో ఇంగ్లండ్ టెస్టు సిరీస్ కోసం భారత జట్టు ప్రకటనకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ముహార్తం ఖారారు చేసింది. క్రిక్‌బజ్ రిపోర్ట్ ప్రకారం.. మే 23న బీసీసీఐ విలేకరుల సమావేశం నిర్వహించి, ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే జట్టుతో పాటు భారత టెస్ట్ కెప్టెన్‌ను కూడా ప్రకటించననున్నట్లు సమాచారం.
రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో కొత్త కెప్టెన్ ఎంపిక ఇప్పుడు అనివార్యమైంది. తొలుత ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టును మే 20న ప్రకటిస్తామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా పేర్కొన్నారు. కానీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావలనుకుంటున్నట్లు బీసీసీఐకి చెప్పడంతో జట్టు ప్రకటనను రెండు రోజుల పాటు వాయిదా వేసినట్లు వినికిడి.
కోహ్లిని తన నిర్ణయాన్ని మార్చుకోవాలని బీసీసీఐ సూచించినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. మరి కోహ్లి యూ-టర్న్ తీసుకుంటాడా? లేదా అన్నది మరో కొన్ని రోజుల్లో తేలిపోనుంది. ఇక భారత టెస్టు కెప్టెన్సీ రేసులో శుభ్‌మన్ గిల్ ముందుంజలో ఉన్నాడు.
ప్రస్తుతం టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా కొనసాగుతున్నాడు. కానీ గాయాల బెడద, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా అతడికి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించకూడదని బీసీసీఐ భావిస్తుందంట. దాదాపు శుబ్‌మన్ గిల్ పేరును బీసీసీఐ ఖారారు చేసినట్లు వినికిడి.