‘భారత్‌ వ్యతిరేక సెంటిమెంట్‌తో కొంపముంచిన నిర్ణయం’ | BCB walked into trap in T20 WC withdrawal: Ex ACC CEO Slams Asif Nazrul | Sakshi
Sakshi News home page

T20 WC: ‘భారత్‌ వ్యతిరేక సెంటిమెంట్‌తో కొంపముంచిన నిర్ణయం’

Apr 11 2026 2:03 PM | Updated on Apr 13 2026 10:18 AM

BCB walked into trap in T20 WC withdrawal: Ex ACC CEO Slams Asif Nazrul

బీసీబీ మాజీ చీఫ్‌పై విమర్శలు

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ సమయంలో బంగ్లాదేశ్‌ వ్యవహరించిన తీరు సరికాదని ఆసియా క్రికెట్‌ మండలి (ఏసీసీ) మాజీ సీఈవో అష్రాఫుల్‌ హక్‌ అన్నాడు. భారత వ్యతిరేక సెంటిమెంట్‌తో కొంతమంది పన్నిన కుట్రలో బంగ్లా క్రికెట్‌ బోర్డు (BCB) మాజీ చీఫ్‌ భాగమయి ఉంటారని అభిప్రాయపడ్డాడు. వీరి నిర్ణయాల కారణంగా బంగ్లా క్రికెట్‌ చాలా నష్టపోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.

కాగా షేక్‌ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత బంగ్లాదేశ్‌లో ఏర్పడ్డ తాత్కాలిక ప్రభుత్వం భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసింది. అక్కడి నేతలు కొంతమంది ఈశాన్య భారతం గురించి అవాకులు చెవాకులు పేలగా.. అదే సమయంలో బంగ్లాలో మైనారిటీ హిందువులపై దాడులు పెరిగాయి.

దౌత్యపరమైన ఉద్రిక్తతలు
ఈ నేపథ్యంలో భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరగగా.. ఐపీఎల్‌ నుంచి బంగ్లా ఫాస్ట్‌బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహమాన్‌ను బీసీసీఐ తొలగించింది. దీంతో తమకు భారత్‌లో భద్రత కరువు అంటూ బంగ్లా బోర్డు.. టీ20 ప్రపంచకప్‌ ఆడేందుకు భారత్‌కు రాబోమని పట్టుబట్టింది.

తమ వేదికను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి విజ్ఞప్తి చేయగా.. బంగ్లా వాదనలో నిజం లేదని పేర్కొంటూ ఇందుకు ఐసీసీ నిరాకరించింది. దీంతో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తాము టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్లు బీసీబీ ప్రకటించింది. అయితే, బంగ్లా ఆటగాళ్లు మాత్రం టీ20 ప్రపంచకప్‌ ఆడాలనే కోరిక గురించి పలుమార్లు బయటపెట్టారు.

భారత క్రికెట్‌తో దెబ్బతిన్న సంబంధాలు
మొత్తానికి అప్పటి బీసీబీ తీసుకున్న నిర్ణయం వల్ల బంగ్లాదేశ్‌ ఐసీసీ టోర్నీ ఆడే అవకాశం కోల్పోవడంతో పాటు.. భారత్‌ క్రికెట్‌తో సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. ద్వైపాక్షిక సిరీస్‌లను కొనసాగించాల్సిందిగా బీసీసీఐకి ఇటీవలే బీసీబీ కొత్త యాజమాన్యం లేఖ రాసింది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఏసీసీ మాజీ సీఈవో అష్రాఫుల్‌ హక్‌ తాజాగా రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘అప్పటి బీసీబీ చీఫ్‌​ అమినుల్‌ ఇస్లాం బుల్‌బుల్‌ తీసుకున్న నిర్ణయం నన్ను ఆశ్చర్యపరిచింది. క్రీడా సలహాదారు ఆసిఫ్‌ నజ్రుల్‌ భారత్‌కు వెళ్లవద్దని పన్నిన కుట్రలో ఆయన ఇరుక్కున్నట్లు అనిపించింది.

భారత్‌ వ్యతిరేక సెంటిమెంట్‌తో
ఆసిఫ్‌ చెప్పగానే తాము భారత్‌కు వెళ్లట్లేదంటూ అమినుల్‌ ప్రకటించేశారు. ఆయన ఆటగాళ్ల తరఫున నిలబడాల్సింది. ‘మేము ఇండియాకు వెళ్తాము. టోర్నీ ఆడతాము. ఆటగాళ్లు ఇదే కోరుకుంటున్నారు. మ్యాచ్‌లు సజావుగా సాగేలా సహకరిస్తామని ఒప్పందాల మీద సంతకాలు కూడా చేశాము’ అని గట్టిగా చెప్పాల్సింది.

అప్పుడైనా ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చి ఉండేది. కానీ ఈ విషయంలో ఆసిఫ్‌దే తుది నిర్ణయం.. సొంత నిర్ణయం కూడా అనిపించింది. తమకున్న భారత్‌ వ్యతిరేక సెంటిమెంట్‌ను ఆటపై రుద్దాలని ఆయన ఎందుకు అనుకున్నాడో అర్థం కాలేదు. అతడు చేసిన పని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ను తీవ్రంగా దెబ్బకొట్టింది. ఇది అస్సలు ఆమోదయోగ్యనీయం కాదు’’అని అష్రాఫుల్‌ హక్‌ పేర్కొన్నాడు. 

చదవండి: PSL: ఐపీఎల్‌ లేకుంటే బతుకే లేదు.. ఎంత పొగరు?

Advertisement
 
Advertisement
Advertisement