PSL: ఐపీఎల్‌ లేకుంటే బతుకే లేదు.. ఎంత పొగరు? | More Bollywood Than Actual Cricket: PSL Overseas Star Drops IPL Bombshell | Sakshi
Sakshi News home page

PSL: ఐపీఎల్‌ లేకుంటే బతుకే లేదు.. ఎంత పొగరు?

Apr 11 2026 12:53 PM | Updated on Apr 11 2026 1:07 PM

More Bollywood Than Actual Cricket: PSL Overseas Star Drops IPL Bombshell

సౌతాఫ్రికా క్రికెటర్‌ రిలీ రొసోవ్‌పై భారత క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. ‘‘పొగరు, అహంకారంతో.. అవగాహన లేకుండా ఇష్టారీతిన మాట్లాడితే నష్టపోయేది నువ్వే’’ అని హెచ్చరిస్తున్నారు. ఈమేరకు సోషల్‌ మీడియా వేదికగా కామెంట్ల రూపంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భారీ ధర?
సఫారీ బ్యాటర్‌ రిలీ రొసోవ్‌ను 2026లో క్వెటా గ్లాడియేటర్స్‌ 5.5 కోట్ల రూపాయల ధరకు కొనుగోలు చేసింది. భారత కరెన్సీలో ఇది రూ. 1.85 కోట్లకు సమానం. ఇక రావల్పిండిజ్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో రొసోవ్‌ గ్లాడియేటర్స్‌ తరఫున రాణించాడు. 42 బంతుల్లో 53 పరుగులు చేయడం ద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రిలీ రొసోవ్‌ను ఐపీఎల్‌ను అవమానపరిచే రీతిలో వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌ కంటే పాకిస్తాన్‌ లీగ్‌లోనే క్రికెట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందనే.. ఇదే నిజమైన లీగ్‌ అంటూ అతి చేశాడు.

క్రికెట్‌ కాదు.. బాలీవుడ్‌ 
‘‘ఐపీఎల్‌ సుదీర్ఘ షెడ్యూల్‌ ఉన్న టోర్నమెంట్‌. అయితే, పీఎస్‌ఎల్‌ మాత్రం మంచి పోటీతత్వం ఉన్న లీగ్‌. ఐపీఎల్‌ను ఎక్కువగా బాలీవుడే నడిపిస్తుంది. కాబట్టి ఐపీఎల్‌ అంటే క్రికెట్‌ కంటే కూడా ఎక్కువగా బాలీవుడే (సినిమా రంగమే) గుర్తుకు వస్తుంది. పీఎస్‌ఎల్‌లో క్రికెట్‌కు ప్రాధాన్యం’’ అని రిలీ రొసోవ్‌ వ్యాఖ్యానించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఈ నేపథ్యంలో పాక్‌ అభిమానులు.. ‘‘అవును.. భారత్‌లో నాణ్యమైన క్రికెట్‌కు తావు లేదు’’ అంటూ ఓవరాక్షన్‌ చేస్తుండగా.. ‘‘అందుకే కదా ఐసీసీ టైటిళ్లను టీమిండియా సులువుగా గెలిచేస్తుంటే.. పాక్‌ మాత్రం కనీసం సెమీస్‌ చేరలేక దిగజారిపోతోంది’’ అంటూ భారత నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు. 

అదే సమయంలో.. ‘‘చాలా మంది క్రికెటర్లకు బతునిచ్చిందే ఐపీఎల్‌.. నీకెంత పొగరుంటే ఇలా మాట్లాడతావు’’ అంటూ రొసోవ్‌పై మండిపడుతున్నారు. కాగా రొసోవ్‌ 22 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడి 473 పరుగులు చేయగలిగాడు.

చదవండి: వైభవ్‌ సూర్యవంశీ ఆటకు విరాట్‌ కోహ్లి ఫిదా... ఏమన్నాడంటే..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement