వైభవ్‌ సూర్యవంశీ ఆటకు విరాట్‌ కోహ్లి ఫిదా | Dear Vaibhav: Virat Kohli Gesture For Vaibhav Sooryavanshi Wins Hearts | Sakshi
Sakshi News home page

వైభవ్‌ సూర్యవంశీ ఆటకు విరాట్‌ కోహ్లి ఫిదా... ఏమన్నాడంటే..

Apr 11 2026 11:00 AM | Updated on Apr 11 2026 11:39 AM

Dear Vaibhav: Virat Kohli Gesture For Vaibhav Sooryavanshi Wins Hearts

రాజస్తాన్‌ రాయల్స్‌ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ ఐపీఎల్‌-2026లో ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ)తో మ్యాచ్‌లో అతడు విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డాడు. లక్ష్యం ఎంతైనా.. ప్రత్యర్థి ఎవరైనా బంతిని బాదడమే లక్ష్యంగా ముందుకు సాగిపోయాడు.

26 బంతుల్లోనే 78 పరుగులతో
బెంగళూరు విధించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వైభవ్‌ సూర్యవంశీ 26 బంతుల్లోనే 78 పరుగులతో దుమ్ములేపాడు. ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ ఇన్నింగ్స్‌లో ఎనిమిది ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉండటం విశేషం. వైభవ్‌కు తోడు ధ్రువ్‌ జురెల్‌ (43 బంతుల్లో 81 నాటౌట్‌) రాణిచండంతో రాయల్స్‌ 18 ఓవర్లలోనే టార్గెట్‌ పూర్తి చేసి.. ఆర్సీబీపై ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.

కోహ్లి సైతం ఫిదా
ఇక వైభవ్ ఆటను చూసి ఆర్సీబీ దిగ్గజం, టీమిండియా లెజెండరీ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి సైతం ఆశ్చర్యపోయాడు. ఈ బిహారీ పిల్లాడిపై ప్రశంసలు కురిపిస్తూ అతడిని అభినందించాడు. అంతేకాదు.. వైభవ్‌ రాయల్స్‌ క్యాప్‌పై.. ‘‘ప్రియమైన వైభవ్‌.. అత్యద్భుతంగా ఆడావు’’ అని రాసి తన ఆటోగ్రాఫ్‌ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను రాయల్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

కాగా సొంతమైదానం గువాహటి వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్తాన్‌.. ఆర్సీబీని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ ఎనిమిది వికెట్ల నష్టానికి 201 పరుగులు సాధించింది. కోహ్లి (16 బంతుల్లో 32), కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ (40 బంతుల్లో 63) రాణించారు. ఆఖర్లో రొమారియో షెఫర్డ్‌ (11 బంతుల్లో 22), వెంకటేశ్‌ అయ్యర్‌ (15 బంతుల్లో 29 నాటౌట్‌) మెరుపులు మెరిపించారు.

ఇక లక్ష్య ఛేదనలో వైభవ్‌, ధ్రువ్‌ జురెల్‌లతో పాటు రవీంద్ర జడేజా (25 బంతుల్లో 24) కూడా తన వంతు సహకారం అందించాడు. కాగా ఈ సీజన్‌లో వైభవ్‌ ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లలో కలిపి 200 పరుగులు పూర్తి చేసుకుని అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచి.. ఆరెంజ్‌ క్యాప్‌ విజేతగా కొనసాగుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement