
ఆసియా కప్ 2025లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 13) శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓపెనర్లు తంజిద్ హసన్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఖాతా తెరవకుండానే ఔటైన వారిద్దరు.. టీ20 ఆసియా కప్ చరిత్రలో డకౌటైన నాలుగో ఓపెనింగ్ జోడీగా నిలిచింది.
గతంలో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, అజింక్య రహానే, బంగ్లాదేశ్‌కే చెందిన మరో ఓపెనింగ్ జోడీ మొహమ్మద్ మిధున్, సౌమ్య సర్కార్, ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ ఇలాంటి చెత్త ప్రదర్శన (డకౌట్లు) చేశారు. తాజా ఉదంతంతో తంజిద్-పర్వేజ్ జోడీ రోహిత్, రహానే సరసన చేసింది.
కాగా, నిన్నటి ఆసియా కప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ శ్రీలంక చేతిలో 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. శ్రీలంక బౌలర్లు రెచ్చిపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 139 పరుగులకే పరిమితమైంది.
లంక బౌలర్లలో నువాన్ తుషార (4-1-17-1), చమీరా (4-1-17-1), హసరంగ (4-0-25-2) అద్భుతంగా బౌలింగ్ చేసి బంగ్లాదేశ్ పని పట్టారు. బంగ్లా ఇన్నింగ్స్‌కు ఓపెనర్లు తంజిద్, పర్వేజ్ డకౌటై చెత్త ఆరంభాన్ని ఇచ్చారు. లిట్టన్ దాస్ (28), జాకిర్ అలీ (41 నాటౌట్), షమీమ్ హొస్సేన్ (42 నాటౌట్) అతి కష్టం మీద పరుగులు చేసి బంగ్లాదేశ్‌కు ఆమాత్రం స్కోరైనా అందించారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో శ్రీలంక బ్యాటర్లు చెలరేగి ఆడారు. ఓపెనర్ పథుమ్ నిస్సంక (50), కమిల్ మిషారా (46 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో ఆ జట్టు 14.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది.