
8 పరుగులతో అఫ్గానిస్తాన్‌పై గెలుపు
అబుదాబి: ఆసియా కప్ టి20 టోర్నీలో బంగ్లాదేశ్ కీలక విజయాన్ని అందుకుంది. ‘సూపర్–4’ రేసులో తమకు పోటీగా వచ్చే అవకాశం ఉన్న అఫ్గానిస్తాన్‌పై పైచేయి సాధించింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో బంగ్లా 8 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్‌ను ఓడించింది. ముందుగా బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఓపెనర్ తన్‌జీద్ హసన్ (31 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తన్‌జీద్, మరో ఓపెనర్ సైఫ్ హసన్ (28 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) కలిసి తొలి వికెట్‌కు 40 బంతుల్లో 63 పరుగులు జోడించారు.
అయితే ఆ తర్వాత అఫ్గాన్ స్పిన్నర్లు నూర్ అహ్మద్ (2/23), రషీద్ ఖాన్ (2/26) బంగ్లా బ్యాటర్లను కట్టి పడేసి తొలి నాలుగు వికెట్లు పడగొట్టారు. ఈ దశలో తౌహీద్ హృదయ్ (20 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్) కొంత పోరాడటంతో స్కోరు 150 పరుగులు దాటింది. అనంతరం అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. గుర్బాజ్ (31 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఒమర్జాయ్ (16 బంతుల్లో 30; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించగా...ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు.
చివర్లో రషీద్ ఖాన్ (11 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) గెలిపించేందుకు ప్రయత్నించినా ... 11 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిన దశలో అతను అవుట్ కావడంతో అఫ్గాన్ ఓటమి ఖాయమైంది. ముస్తఫిజుర్ రహమాన్ 3 వికెట్లు పడగొట్టగా... నసుమ్ అహ్మద్, రిషాద్ హుస్సేన్ చెరో 2 వికెట్లు తీశారు. నేడు జరిగే మ్యాచ్‌లో యూఏఈతో పాకిస్తాన్ ఆడుతుంది.