‘అదంతా నాటకం.. మంచి కెప్టెన్లు ఇలా చేయరు’ | Bad captains tend to hide behind fake smile: Steyn slams 2 India IPL captains | Sakshi
Sakshi News home page

నకిలీ నవ్వులు.. వాళ్లిద్దరు చెత్త కెప్టెన్లు: సౌతాఫ్రికా దిగ్గజం

May 25 2026 3:53 PM | Updated on May 25 2026 3:57 PM

Bad captains tend to hide behind fake smile: Steyn slams 2 India IPL captains

ఐపీఎల్‌-2026 సీజన్‌లో అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచిన జట్లుగా లక్నో సూపర్‌ జెయింట్స్‌, ముంబై ఇండియన్స్‌ నిలిచాయి. గతంలో ప్లే ఆఫ్స్‌ చేరిన అనుభవం ఉన్న లక్నో.. ఈసారి లీగ్‌ దశలో పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగే గెలిచింది.

ఇక ఐదుసార్లు చాంపియన్‌ అయిన ముంబై పరిస్థితి కూడా ఇలాగే ఉంది. లక్నో (-0.740) మాదిరే నాలుగు మ్యాచ్‌లే గెలిచినా.. నెట్‌రన్‌రేటు పరంగా కాస్త మెరుగ్గా ఉండి.. ముంబై (-0.584) తొమ్మిదోస్థానంలో నిలవగలిగింది. లక్నో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. ఈసారి ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా లక్నో నిలవగా.. తర్వాతి స్థానాన్ని ముంబై ఆక్రమించింది.

నవ్వుతూ మాట్లాడుతూ
అయితే.. అటు ముంబై కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా.. ఇటు లక్నో సారథి రిషభ్‌ పంత్‌ మ్యాచ్‌ అనంతరం తమ జట్లను వెనకేసుకువచ్చారు. నవ్వుతూ మాట్లాడుతూ పరిస్థితిని తేలికపరిచే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ హార్దిక్‌, పంత్‌ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు.

లోలోపల ఆగ్రహంతో ఉడికిపోతున్నారు
మరో ప్రొటిస్‌ దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ యూట్యూబ్‌ చానెల్‌లో మాట్లాడుతూ.. ‘‘ఒత్తిడిని చిరునవ్వుతో దాచేసే ప్రయత్నం చేసిన ఇద్దరు ఐపీఎల్‌ కెప్టెన్ల గురించి ఇప్పుడు చెప్పబోతున్నా. వారిద్దరు మరెవరో కాదు.. పంత్‌, హార్దిక్‌. ఒత్తిడి తమను ఏమీ చేయలేదన్నట్లుగా నవ్వుతో కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు.

కానీ మ్యాచ్‌ ఎలా సాగిందో పట్టించుకునే ప్రయత్నం చేయలేదు. మేము పుంజుకుంటాము. మా జట్లు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. ఒక్కసారైనా తాము నిరాశ చెందామని వాళ్లు చెప్పారా?.. నిజానికి వాళ్లు లోలోపల ఆగ్రహంతో ఉడికిపోతున్నారు. కానీ బయటకు కనబడనివ్వలేదు.

మంచి కెప్టెన్లు ఇలా చేయరు
వాళ్లిద్దరు ప్రొఫెషనల్‌ క్రికెటర్లు. గెలవాలనే కోరుకున్నారు. తమ జట్ల బాగా ఆడాలని భావించారు. నిజానికి మంచి కెప్టెన్లు జట్టు నిరాశపరిచినపుడు.. ఆ కోపాన్ని ప్రదర్శిస్తాడు. ‘నేను కోపంగా ఉన్నాను. మనం ఇంకా మెరుగ్గా ఆడాలి’ అనే సందేశాన్ని ఇస్తాడు.

అయితే, ఫేక్‌ నవ్వులతో ఒత్తిడిని కప్పిపుచ్చే వాళ్లు మాత్రం చెత్త కెప్టెన్లు. సీజన్‌ ముగిసిన తర్వాత కూడా.. ‘బాధ పడాల్సిందేమీ లేదు. మేము మళ్లీ గొప్పగా తిరిగివస్తాం’ అని కబుర్లు చెప్తారు. కానీ ప్రతిసారీ అదే మాట చెప్పడం అంత బాగుండదు కదా!’’ అని డేల్‌ స్టెయిన్‌ హార్దిక్‌ పాండ్యా, రిషభ్‌ పంత్‌ తీరును ఎండగట్టాడు.  

చదవండి: వైభవ్‌ వల్లే జైస్వాల్‌ ఫెయిల్‌.. అతడి స్థానాన్ని ఆక్రమించాడు!

Advertisement
 
Advertisement
Advertisement