Aryna Sabalenka: ఎగతాళి చేసిన గడ్డపైనే చప్పట్లు

AUS Open 2023: Aryna Sabalenka Dream Fulfill-Winning 1st-Grandslam Title - Sakshi

ఐదేళ్ల క్రితం సబలెంకా తొలిసారి ఆ్రస్టేలియా ఓపెన్‌ బరిలోకి దిగింది. మొదటి రౌండ్‌ మ్యాచ్‌లోనే ఆమె స్థానిక స్టార్‌ యాష్లీ బార్టీతో తలపడాల్సి వచ్చింది. అయితే షాట్‌ ఆడే సమయంలో సబలెంకా చేస్తున్న అరుపులు వివాదాన్ని రేపాయి. ప్రేక్షకులు ఆమెను బాగా ఎగతాళి చేశారు. చివరకు ఓటమితో మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించాల్సి వచ్చింది. ఇప్పుడు అదే గడ్డపై ఆమెపై అభినందనలతో చప్పట్ల వర్షం కురుస్తోంది.

సబలెంకా దూకుడైన ఆట, పదునైన ఏస్‌లు తప్ప ఆమె అరుపులు ఎవరికీ వినిపించడం లేదు. సబలెంకా ఎడమ చేతిపై పెద్దపులి టాటూ ఉంటుంది.  ‘నేను నాలాగే ఉంటాను. ఎవరినీ లెక్క చేయను. నేను టైగర్‌ను’ అంటూ తనకు తాను చెప్పుకునే సబలెంకా అలాంటి ధీరోదాత్త ఆటను ప్రదర్శించింది.

ఆరడుగుల ఎత్తు ఉన్న సబలెంకా బలం వేగవంతమైన సర్వీస్‌లో ఉంది. అయితే అదే బలం బలహీనతగా మారి గత టోర్నీలో నాలుగు రౌండ్లలోనే 56 డబుల్‌ఫాల్ట్‌లు చేసింది. ఈ సారి తన కోచింగ్‌ బృందంతో కలిసి ప్రత్యేక దృష్టి పెట్టిన ఆమె ఇప్పుడు 7 మ్యాచ్‌లలో కలిపి 29 డబుల్‌ ఫాల్ట్‌లే చేసింది.

సబలెంకా టెన్నిస్‌ను చాలా ఆలస్యంగా మొదలు పెట్టింది. హాకీ ఆటగాడైన తండ్రి సెర్గీ ప్రోత్సాహంతో ఆటలోకి అడుగు పెట్టిన ఆమె 15 ఏళ్ల వయసు వరకు ఎలాంటి జూనియర్‌ టోర్నీలు ఆడనే లేదు. 16 ఏళ్ల వయసులో నేషనల్‌ టెన్నిస్‌ అకాడమీలో చేరిన తర్వాత ఆమె కెరీర్‌ మలుపు తిరిగింది.

2019లో తండ్రి ఆకస్మిక మరణం సబలెంకాను కలచివేసింది. ‘మా నాన్న నన్ను వరల్డ్‌నంబర్‌వన్‌గా చూడాలనుకున్నారు’ అని ఆమె గుర్తు చేసుకుంది. ఓపెన్‌ ఎరాలో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచిన 58వ మహిళా ప్లేయర్‌గా నిలిచి రెండో ర్యాంక్‌కు చేరిన సబలెంకా నంబర్‌వన్‌ కావడానికి మరెంతో దూరం లేదు!  

చదవండి: AUS Open 2023: మహిళల సింగిల్స్‌ విజేత సబలెంకా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top