
ఆసియా కప్ 2025లో భాగంగా సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్లు దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. ఈ దాయాదుల పోరు కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ మెగా టోర్నీని ఇప్పటికే టీమిండియా అద్బుతమైన విజయంతో ప్రారంభించింది.
బుధవారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో యూఏఈను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 4.3 ఓవర్లలోనే భారత్ ఊదిపడేసింది. ఇప్పుడు పాకిస్తాన్‌పై కూడా అదే జోరును కొనసాగించాలని మెన్ ఇన్ బ్లూ భావిస్తోంది.
మరోవైపు పాక్ తమ తొలి మ్యాచ్‌లో శుక్రవారం దుబాయ్ వేదికగానే ఒమన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో పసికూన ఒమన్‌ను పాక్ ఓడించడం దాదాపు ఖాయం అని చెప్పాలి. కానీ ఆదివారం మాత్రం పాక్‌కు భారత్ నుంచి కఠిన సవాల్ ఎదురుకానుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో దుమ్ములేపుతున్న సూర్య సేనను పాక్ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.
నో ఛేంజ్..?
కాగా పాక్‌తో మ్యాచ్‌కు భారత తుది జట్టులో ఎటువంటి మార్పులు చోటు చేసుకోపోవచ్చు. యూఈఏతో ఆడిన ప్లేయింగ్ ఎలెవన్‌తో టీమిండియా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తుది జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్‌గా సంజూ శాంసన్‌ను కొనసాగించనున్నారు.
యూఏఈతో మ్యాచ్‌లో సంజూకు బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. ఈ కేరళ ఆటగాడు మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు రానున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా భారత ముగ్గురు స్పిన్నర్లతో ఆడే అవకాశముంది. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఇద్దరూ స్పెషలిస్టు స్పిన్నర్లగా కొనసాగనున్నారు.
దీంతో యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా ప్రధాన పేసర్‌గా ఉండనున్నాడు. అతడితో పాటు మీడియం పేస్ బౌలర్లు శివమ్ దూబే, హార్ధిక్ పాండ్యా బంతిని పంచుకోనున్నారు.
భారత్ తుది జట్టు(పాకిస్తాన్)
అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి
చదవండి: టీమిండియాలో నో ఛాన్స్.. ఆ కసి అక్కడ చూపించేశాడు! 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో