
PC: X
భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌కు నగారా మోగింది. టీమిండియాతో మ్యాచ్‌లో పాక్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసియా కప్-2025 టోర్నమెంట్లో భాగంగా గ్రూప్-‘ఎ’లో ఉన్న దాయాదుల మధ్య ఆదివారం నాటి పోరుకు దుబాయ్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.
ఈసారి టీ20 ఫార్మాట్లో జరుగుతున్న ఈ ఖండాంతర టోర్నీలో టీమిండియా, పాక్‌లతో పాటు యూఏఈ, ఒమన్ గ్రూప్-‘ఎ’లో ఉన్నాయి. ఇప్పటికే భారత జట్టు యూఏఈపై ఘన విజయం సాధించగా.. పాకిస్తాన్ ఒమన్‌పై గెలుపొందింది. ఈ క్రమంలో చిరకాల ప్రత్యర్థులు ఈ టోర్నీలో తమ రెండో మ్యాచ్‌లో పరస్పరం తలపడుతున్నాయి.
మేము గొప్పగా ఆడుతున్నాము
ఇక భారత్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన నేపథ్యంలో పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా మాట్లాడుతూ.. ‘‘మేము తొలుత బ్యాటింగ్ చేస్తాము. గత కొన్ని రోజులుగా మేము గొప్పగా ఆడుతున్నాము. ఈ మ్యాచ్ కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నాం.
ఇది కాస్త స్లో వికెట్‌లా కనిపిస్తోంది. అందుకే తొలుత బ్యాటింగ్ చేసి మెరుగైన స్కోరు సాధించాలని పట్టుదలగా ఉన్నాము. గత ఇరవై రోజులుగా మేము ఇక్కడ ఆడుతున్నాం కాబట్టి పిచ్ పరిస్థితులపై మాకు పూర్తి అవగాహన ఉంది’’ అని పేర్కొన్నాడు.
కాగా ఆసియా కప్ టోర్నీ సన్నాహకాల్లో భాగంగా పాక్.. యూఏఈ- అఫ్గనిస్తాన్‌తో టీ20 ట్రై సిరీస్ ఆడింది. ఈ ముక్కోణపు సిరీస్‌ను పాక్ కైవసం చేసుకుంది. మరోవైపు.. టీమిండియాకు కూడా దుబాయ్ పిచ్‌లు కొత్తేం కాదు.
తొలుత బౌలింగ్ చేయాలనే భావించాం
ఇక టాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘మేము తొలుత బౌలింగ్ చేయాలనే భావించాం. వికెట్ చాలా బాగుంది. పాతబడే కొద్ది బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. తేమగా ఉంది. కాబట్టి డ్యూ ఉంటుందని ఆశిస్తున్నాం. ఈ మ్యాచ్‌లో... యూఏఈతో ఆడిన తుదిజట్టునే ఆడిస్తున్నాం’’ అని తెలిపాడు.
ఆసియా కప్-2025 భారత్ వర్సెస్ పాకిస్తాన్ తుదిజట్లు
టీమిండియా
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి
పాకిస్తాన్
సాహిబ్‌జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, మహ్మద్ హారీస్(వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, సల్మాన్ ఆఘా(కెప్టెన్), హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సుఫియాన్ ముఖీమ్, అబ్రార్ అహ్మద్.
చదవండి: టీమిండియా కెప్టెన్‌గా తిలక్ వర్మ.. బీసీసీఐ ప్రకటన
Coin falls in favour of Pakistan and they choose to bat first 🏏
Watch #INDvPAK LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/IU98kUSWda— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025