Ashes Series 2nd Test: అసలేం చేస్తున్నావు.. నువ్వు కెప్టెన్‌గా ఉండి ఏం లాభం: రికీ పాంటింగ్‌

Ashes Series 2nd Test: Ricky Ponting Slams Joe Root Why Are You Captain Then - Sakshi

Ricky Ponting Comments On Joe Root Captaincy: ఇంగ్లండ్‌ టెస్టు జట్టు కెప్టెన్‌ జో రూట్‌ తీరును ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం రికీ పాంటింగ్‌ విమర్శించాడు. అసలు కెప్టెన్‌గా ఉండి ఏం లాభం అంటూ ఘాటు విమర్శలు చేశాడు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా రెండో టెస్టులో ఇంగ్లండ్‌ ఆసీస్‌ చేతిలో చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. 275 పరుగుల తేడాతో ఓటమి పాలై భంగపాటుకు గురైంది. మరోవైపు .. సిరీస్‌ ఆరంభం నుంచి దూకుడు మీదున్న ఆతిథ్య ఆసీస్‌ జట్టు 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన జో రూట్‌ తమ బౌలర్ల ప్రదర్శనపై పెదవి విరిచాడు. సరైన లెంత్‌తో బౌల్‌ చేయలేకపోయారని వాపోయాడు. నాలుగేళ్ల క్రితం జరిగిన తప్పిదాలే పునరావృతమయ్యాయని.. ఇంకాస్త మెరుగ్గా ఆడి ఉంటే బాగుండేదని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా మొదటి ఇన్నింగ్స్‌లో నిలకడలేమి కారణంగా ప్రత్యర్థిని కట్టడిచేయలేపోయామని పేర్కొన్నాడు. 

ఈ క్రమంలో రికీ పాంటింగ్‌ మాట్లాడుతూ.. ‘‘నిజంగా రూట్‌ మాటలు వినగానే షాక్‌కు గురయ్యాను. బౌలర్లను మార్చాల్సింది ఎవరు? నువ్వు కెప్టెన్‌గా ఉండి ఏం చేస్తున్నావు? బౌలర్ల లైన్‌ లెంగ్త్‌ గురించి సలహాలు ఇవ్వలేవా? నువ్వు అసలు మైదానంలో ఏం చేస్తున్నావు?’’ అని మండిపడ్డాడు. 

అదే విధంగా... ‘‘కెప్టెన్‌గా.. నీకెలాంటి ప్రదర్శన కావాలో బౌలర్లకు చెప్పాలి. నువ్వు ఆశించినట్లుగా జరగడం లేదని భావించినపుడు వాళ్లను మార్చాలి. నీ వ్యూహాలను అమలు చేసే బౌలర్లను రంగంలోకి దించాలి. ప్రత్యర్థి బ్యాటర్లను అవుట్‌ చేయడానికి ఎలాంటి ప్రణాళికలు రచించావో.. వాళ్లు ఏం అనుకుంటున్నారో తెలుసుకోవాలి. ముందు వాళ్లతో ఓపెన్‌గా మాట్లాడాలి. అది కదా కెప్టెన్సీ అంటే’’ అంటూ తీవ్రస్థాయిలో విమర్శించాడు.

రెండో టెస్టు- స్కోర్లు: 
►ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 473-9 డిక్లేర్డ్‌
►రెండో ఇన్నింగ్స్‌: 230-9 డిక్లేర్డ్‌

►ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 236-10 ఆలౌట్‌
►రెండో ఇన్నింగ్స్‌:  192 ఆలౌట్‌

చదవండి: Ashes Series 2nd Test: చివరి రోజు 69.5 ఓవర్ల పాటు బ్యాటింగ్‌... 50.4 ఓవర్లు ఎదుర్కొంది ఆ ఇద్దరే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top