
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025 కోసం క్రికెట్ ఆస్ట్రేలియా 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న కెప్టెన్ అలిస్సా హీలీ తిరిగి టీమ్‌లోకి వచ్చింది. దీంతో ఈ మెగా టోర్నీలో ఆసీస్ జట్టుకు హీలీ నాయకత్వం వహించనుంది.
ఇది ఆమెకు మూడో వన్డే ప్రపంచకప్ కావడం గమనార్హం. ఇక ఈ జట్టులో ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, యాష్ గార్డ్నర్, తహ్లియా మెక్‌గ్రాత్, మేగాన్ షుట్, వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. అదేవిధంగా స్టార్ స్పిన్నర్ సోఫీ మోలినెక్స్ కూడా తిరిగి జట్టులోకి వచ్చింది. దీంతో ఆసీస్ స్పిన్ విభాగం మరింత పటిష్టంగా మారింది.
స్పిన్ యూనిట్‌లో మోలినెక్స్‌తో పాటు అలానా కింగ్, జార్జియా వేర్‌హామ్ కూడా ఉన్నారు. మరోవైపు యువ ఆటగాళ్లు జార్జియా వోల్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, వేర్‌హామ్, కిమ్ గార్త్ వంటి యువ ప్లేయర్లు తొలిసారి వన్డే ప్రపంచకప్‌లో ఆడనున్నారు.
అయితే ఈ ప్రధాన టోర్నీకి ముందు భారత మహిళల జట్టుతో ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌లో కూడా ప్రపంచకప్‌కు ఎంపికైన ఆసీస్ జట్టే భాగం కానుంది. అదనంగా వికెట్ కీపర్ నికోల్ ఫాల్టమ్, ఆల్ రౌండర్ చార్లీ నాట్ భారత్‌తో సిరీస్‌లో ఆడనున్నారు.
ఈ సిరీస్ ముగిశాక వీరిద్దరూ తిరిగి తమ స్వదేశానికి వెళ్లిపోనున్నారు. ఆసీస్ తమ వరల్డ్‌కప్ ప్రయణాన్ని ఆక్టోబర్ 1న న్యూజిలాండ్ మ్యాచ్‌తో ఆరంభించనుంది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఇప్పటికే రికార్డు స్దాయిలో ఏడు సార్లు ప్రపంచ కప్ విజేతగా ఆసీస్ నిలిచింది.
వరల్డ్‌కప్‌కు ఆసీస్ జట్టు
అలిస్సా హీలీ (కెప్టెన్), తహ్లియా మెక్‌గ్రాత్ (వైస్ కెప్టెన్), డార్సీ బ్రౌన్, ఆష్లీ గార్డనర్, కిమ్ గార్త్, గ్రేస్ హారిస్, అలానా కింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, సోఫీ మోలినెక్స్, బెత్ మూనీ, ఎల్లీస్ పెర్రీ, మేగాన్ షుట్, అన్నాబెల్ సదర్లాండ్, జార్జియా వోల్, జార్జియా వేర్‌హామ్.
చదవండి: Asia Cup 2025: కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. ఓపెనర్లుగా బాబర్ ఆజం, జైశ్వాల్