కామన్‌వెల్త్‌ క్రీడల్లో క్రికెట్‌.. షెడ్యూల్‌ ప్రకటించిన నిర్వహకులు

2022 CWG Womens T20 Competition To Be Held From July 29 To August 7 - Sakshi

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది బర్మింగ్​హామ్​ వేదికగా జరగనున్న కామన్వెల్త్​ క్రీడల్లో మహిళల టీ20 క్రికెట్ అరంగేట్రం చేయనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను నిర్వహకులు మంగళవారం ప్రకటించారు. ఈ పోటీలను జూలై 29 నుంచి ఆగస్టు 7 వరకు ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా నిర్వహిస్తామని వెల్లడించారు. మొత్తం ఎనిమిది జట్లు గ్రూప్‌లుగా విడిపోయి, ఆగస్టు 4 వరకు మ్యాచ్‌లు ఆడతాయని, ఆగస్టు 6న సెమీస్‌ పోరు ఉంటుందని తెలిపారు. కాంస్య పతకానికి సంబంధించిన మ్యాచ్‌తో పాటు ఫైనల్‌ మ్యాచ్‌ను ఆగస్టు 7న నిర్వహిస్తామని పేర్కొన్నారు.

కాగా, ఏప్రిల్‌ 1 నాటికి ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో తొలి ఆరు స్థానాల్లో ఉ‍న్న జట్లు నేరుగా ఈ పోటీలకు అర్హత సాధిస్తాయని, మిగిలిన రెండు బెర్త్‌ల కోసం అర్హత పోటీలు నిర్వహించనున్నామని నిర్వహకులు వివరించారు. ప్రస్తుత ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత మహిళల జట్టు మూడో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ జట్లు తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. కాగా, కామన్వెల్త్‌ క్రీడల్లో క్రికెట్‌కు ప్రాతినిధ్యం లభించడం ఇది తొలిసారేమీ కాదు. 1998 కౌలాలంపూర్‌లో జరిగిన క్రీడల్లో పురుషుల క్రికెట్‌ జట్టు తొలిసారిగా పాల్గొంది. అయితే ఆ తర్వాత వివిధ కారణాల చేత సీడబ్యూజీలో క్రికెట్‌కు ప్రాతినిధ్యం దక్కలేదు. తిరిగి 24 ఏళ్ల తర్వాత ఈ క్రీడల్లో క్రికెట్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి.
చదవండి: Cricket History: మూడేళ్ల కిందట ఇవాల్టి రోజున ఏం జరిగిందంటే..?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top