జింబాబ్వే క్రికెటర్ బ్లెస్సింగ్ ముజర్‌బానీపై నిషేధం పడింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) ఆడకుండా పాక్ క్రికెట్ బోర్డు అతడిపై రెండేళ్ల నిషేధం విధించింది. చాలా మంది ఆటగాళ్ల మాదిరే ముజర్‌బానీ ఇటు ఐపీఎల్.. అటు పీఎస్‌ఎల్ వేలంలో తన పేరు నమోదు చేసుకున్నాడు.
కానీ రెండు లీగ్‌లకు సంబంధించిన ఫ్రాంఛైజీలలో ఒక్కటి కూడా ముజర్‌బానీని కొనుగోలు చూసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో అతడు అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. అదే సమయంలో టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో జింబాబ్వే అదరగొట్టింది.
ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు
ఏకంగా ఆస్ట్రేలియాను ఓడించి సూపర్-8లో అడుగుపెట్టింది. ఇందులో ముజర్‌బానీది కీలక పాత్ర. ఆసీస్‌తో మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 17 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చాడు. ఈ నేపథ్యంలో పీఎస్‌ఎల్ ఫ్రాంఛైజీ ఇస్లామాబాద్ యునైటెడ్ షమార్ జోసెఫ్ స్థానంలో ముజర్‌బానీతో ఒప్పందం కుదుర్చుకుంది.
అయితే, అనూహ్యంగా ముజర్‌బానీకి ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) నుంచి ఆఫర్ వచ్చింది. భారత్- బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ తమ జట్టు నుంచి బంగ్లా స్టార్ ముస్తాఫిజుర్‌ను తొలగించింది. అతడి స్థానంలో మరో ఫాస్ట్‌బౌలర్ ముజర్‌బానీని జట్టులో చేర్చుకోవాలని భావించింది.
పీఎస్‌ఎల్‌ను వీడి ఐపీఎల్‌లో
ఇందుకు సమ్మతించిన ముజర్‌బానీ.. పీఎస్‌ఎల్‌ను వీడి ఐపీఎల్‌లో కేకేఆర్‌తో చేరాడు. దీంతో పాక్ బోర్డు అతడిపై చర్యలు చేపట్టింది. ‘‘ఫ్రాంఛైజీ ఆధారిత క్రికెట్ ఆడేవాళ్లు పారదర్శకత ప్రదర్శించాలి. ప్రొఫెషనల్‌గా వ్యవహరించాలి.
ఒకేసారి రెండు జట్లతో ఒప్పందం చేసుకోవడం.. ఒక జట్టు కోసం మరో జట్టును వీడటం సరికాదు. ఇలాంటి ప్రవర్తనను చూసీచూడనట్లు వదిలివేయలేము. ఫ్రాంఛైజీల విశ్వసనీయత దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది.
నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ రెండేళ్ల నిషేధం విధిస్తున్నాం’’ అని పీఎస్‌ఎల్ పేర్కొంది. కాగా ముజర్‌బానీతో పాటు దసున్ షనక, స్పెన్సర్ జాన్సన్ కూడా ఈ ఏడాది పీఎస్‌ఎల్‌ను వీడి ఐపీఎల్‌లో చేరిన సంగతి తెలిసిందే. వీరిపై కూడా నిషేధం పడే అవకాశం ఉంది.


