కోతుల బారి నుంచి మమ్ములను రక్షించాలని మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి మొరపెట్టుకున్న పిల్లల పరిస్థితిని చూస్తే కోతుల తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థుల స్కూల్ బ్యాగు కనబడితే చాలు కోతులు వెంటబడి దాడులు చేస్తున్న పరిస్ధితి నిత్యకృత్యంగా మారింది. అసలే దసరా సెలవులు. ప్రతి ఇంటిలో పండుగ వాతావరణంతో పాటు పిల్లల సందడి నెలకొంటుంది. ఇంటి ఆవరణలో ఆడుకుంటూ పండుగ సెలవులను ఎంజాయి చేస్తారు. ఈ సమయంలో కోతుల బెడద పిల్లలను ఆందోళనకు గురి చేస్తోంది. ఓ వైపు ఎంజాయ్ చేయాలనే ఆతృత, మరోవైపు కోతులు దాడి చేస్తాయనే భయంతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే పిల్లలు జంకుతున్నారు. ఈ క్రమంలో కోతుల బారి నుంచి తమ పిల్లలను కాపాడుకునేందుకు ఇంటి ఎదుట, రోడ్డు పైన మహిళలు కర్రలు పట్టుకొని కాపలా కాస్తుండటం గమనార్హం.


