అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు జీపీఎస్ సిస్టమ్ ప్రతీ కదలిక ఇక రికార్డు! జిల్లాలో 508 పంచాయతీలు.. 493 ట్రాక్టర్లు
దుబ్బాకటౌన్: గ్రామీణ పాలనలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీలకు చెందిన పారిశుద్ధ్య ట్రాక్టర్లకు జీపీఎస్ సిస్టమ్ అమర్చే ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా జిల్లాలోని 493 గ్రామపంచాయతీలలో ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి. కొన్నేళ్లుగా గ్రామపంచాయతీలకు చెందిన ట్రాక్టర్లు, వాటర్ ట్యాంకర్లు నిర్వహణలో అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కొందరు పంచాయతీ ట్రాక్టర్లను తమ సొంత వ్యవసాయ పనులకు, ఇటుక బట్టీలకు, ఇతర వాణిజ్య అవసరాలకు వాడుకుంటున్నారని, వచ్చిన ఆదాయాన్ని సొంత జేబులో వేసుకుంటూ, డీజిల్ ఖర్చు మాత్రం పంచాయతీ నిధుల నుంచి చూపిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. చెత్త సేకరణకు వెళ్లాల్సిన ట్రాక్టర్ వెళ్లకపోవడం వల్ల పల్లెల్లో పారిశుద్ధ్యం లోపిస్తోందని ఆరోపణ. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే ప్రభుత్వం జీపీఎస్ విధానాన్ని అమలులోకి తెచ్చింది.
పైలెట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో..
జగదేవపూర్ మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా జీపీఎస్ బిగించి విజయవంతం కావడంతో ఇప్పుడు జిల్లా మొత్తం పనులు మొదలయ్యాయి. ప్రతి ట్రాక్టర్ కు ఒక చిన్న జీపీఎస్ చిప్ అమర్చుతారు. దీని ద్వారా లైవ్ లొకేషన్, ట్రాక్టర్ ప్రస్తుతం ఎక్కడ ఉంది, రూట్ హిస్టరీ, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడెక్కడ తిరిగింది, ఎన్ని కిలోమీటర్లు నడిచింది అనే సమాచారం నిక్షిప్తమై ఉంటుంది.
జియో ఫెన్సింగ్
ఒక వేళ పంచాయతీ పరిధి దాటి ట్రాక్టర్ బయటకు వెళ్తే వెంటనే ఉన్నతాధికారులకు అలర్ట్ వెళ్తుంది. ఎన్ని గంటలు పనిచేసింది? ఎక్కడ ఎక్కువసేపు ఆగింది? అనేది రికార్డ్ అవుతుంది. ఈ డేటా మొత్తం మండల పంచాయతీ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి మొబైల్ యాప్లో ప్రత్యక్షంగా కనిపిస్తుంది.
493 గ్రామ పంచాయతీల్లో..
జిల్లాలో 508 పంచాయతీలు ఉన్నాయి. దాదాపు ప్రతి పంచాయతీకి ఒక ట్రాక్టర్, ఒక ట్రాలీ, ఒక వాటర్ ట్యాంకర్ ఉంది. ప్రస్తుతం ఉన్న 493 వాహనాలకు ఈ జీపీఎస్లు అమర్చాల్సి ఉంది. దీని వల్ల రోజూ చెత్త సేకరణ 100 శాతం జరుగుతుంది. నెలకు ఒక్కో పంచాయతీలో రూ.5 వేల నుంచి 8 వేల వరకు డీజిల్ ఖర్చు ఆదా అవుతుందని అంచనా. దీంతో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా ఉంటాయి.


