ప్రశాంత్నగర్(సిద్దిపేట): దేశంలోని అనేక రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ అధికార పక్షం ఓట్ల చోరీతో అధికారంలోకి వస్తోందని, ఇకనుంచి ఓట్ల చోరీ చెల్లదని బీఎన్ఆర్కేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దరిపల్లి చంద్రం అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం సమావేశానికి ముఖ్య అతిథిగా దరిపల్లి చంద్రం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ను తమ జేబు సంస్థగా మార్చుకుందన్నారు. సీఈసీ జ్ఞానేశ్కుమార్ అవకతవకలకు బాధ్యత వహిస్తూ తక్షణం రాజీనామా చేయాలన్నారు. అక్షరాస్యత లేని వారు తమ వివరాలను పూర్తి స్థాయిలో తెలపకపోతే ఓట్లను తొలగించడం సరికాదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది కార్మికులు తమ ఓటు హక్కును కోల్పోయారన్నారు. వెంటనే సర్ ప్రక్రియను నిలిపివేయాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లను ముట్టడిస్తామన్నారు. కార్యక్రమంలో మల్లేశం, వేణు, మల్లేశం, పర్శరాములు, మహేందర్, ఎల్లం, ప్రసాద్, పాల్గొన్నారు.


