విచారణ జరుపుతాం
ఆలయంలో ఒగ్గు పూజారుల సంఖ్య పెంపు వ్యవహారంపై సమగ్ర విచారణ జరపడానికి దేవాదాయ శాఖ అధికారులు కమిటీ ఏర్పాటు చేశారు. ఒగ్గు పూజారుల నియామకానికి కొంత మంది దళారులు వసూలు చేస్తున్న డబ్బులతో నాకు ఎలాంటి సంబంధం లేదు. కమిటీ సభ్యులు సమగ్ర విచారణ జరిపి అధికారులకు నివేదిక అందిస్తారు. – సుధాకర్ రెడ్డి, ఆలయ ఈఓ
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఒగ్గు పూజారుల సంఖ్య పెంచేందుకు దళారులు డబ్బుల వసూలు దందాను మళ్లీ మొదలుపెట్టారు. ఈ దందాను గత జనవరిలో దేవాదాయ శాఖ కార్యాలయంలో పని చేసే అధికారి తిరస్కరించారు. అతను బదిలీ కావడంతో దందాను మళ్లీ ప్రారంభించారు. ఆలయంలో రెండు రకాల పూజలు నిర్వహిస్తారు. స్వామి గర్భగుడిలో వీరశైవ అర్చకులు పూజలు నిర్వహిస్తే, ఆలయం బయట జానపద రీతిలో స్వామి వారికి ఒగ్గు పూజారులు పట్నం వేసి పూజలు నిర్వహిస్తారు. వీరశైవ అర్చకులకు దేవాదాయ శాఖ వేతనాలు చెల్లిస్తుంది. ఒగ్గు పూజారులకు పట్నాల టికెట్ల నుంచి వచ్చే ఆదాయంలో 50 శాతం చెల్లిస్తారు. ఇప్పటి వరకు ఆలయంలో 163 మంది ఒగ్గు పూజారులున్నారు. అదనంగా మరో 56 మందిని నియమించాలని కొంత మంది గుట్టు చప్పుడు కాకుండా దేవాదాయ శాఖకు నివేదించారు. అంతేకాకుండా నియామకమవుతున్న వారి నుంచి రూ.3లక్షల చొప్పున బేరం కుదుర్చుకున్నారు. ప్రస్తుతం ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. మిగతా రూ.లక్ష పని పూర్తయిన తర్వాత ఇచ్చేలా ఒప్పందం చేసుకు న్నారు. ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి వీలైనంత త్వరలో నివేదిక అందించాలని ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హన్మంతరావును ఆదేశించారు. వెంటనే ఆయన అదనపు కమిషనర్, జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈఓ, ఒగ్గుపూజారుల ప్రతినిధితో కమిటీ ఏర్పాటు చేశారు. దీంతో కొంత కాలం పాటు గుట్టు చప్పుడు కాకుండా వ్యవహరించిన దళారులు ప్రస్తుతం ఓ మంత్రి ద్వారా రూ.70 లక్షల ఒప్పందం కుదుర్చుకుని ఫైల్ను కదుపుతున్నట్లు సమాచారం.


