అమృత్ 2.0 పనులు లోపభూయిష్టం
అమృత్ 2.0లో భాగంగా రూ.3.14కోట్ల వ్యయంతో చేపడుతున్న బరిచెరువు సుందరీకరణ పనుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక చెరువును మురుగురహితంగా మార్చడానికి మరో కుంటను కలుషితం చేయబోతున్నారు. అంతేకాకుండా ఆ కుంట నుంచి మురుగు బయటకు వెళ్లే కాల్వలు లేక, పట్టణంలోని కాలనీల్లోకి ముంచెత్తనున్నది. ఈ పరిణామం ప్రజారోగ్యానికి ముప్పుగా మారబోతున్నది. – గజ్వేల్
రాష్ట్రంలోని 70మున్సిపాలిటీల్లో కేంద్రం అమృత్ 2.0 కింద రిజువనేషన్ ఆఫ్ వాటర్ బాడీస్ పేరిట పనులను చేపడుతున్నది. ఇందులోభాగంగానే గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్పల్లిలోగల బరిచెరువును సుందరీకరించడానికి ఎంపిక చేశారు. ఇందుకోసం రూ.3.14కోట్ల నిధులు వచ్చాయి. ఈ పనులను ప్రజారోగ్యశాఖ(పబ్లిక్ హెల్త్) ఇంజినీరింగ్ విభాగం చేపడుతున్నది. కానీ పనుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బరి చెరువులోకి మున్సిపాలిటీ పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీ నుంచి నిత్యం మురుగునీరు భారీగా వచ్చి చేరుతోంది. ప్రస్తుతం చేపడుతున్న పనుల్లో భాగంగా ఈ మురుగు బరి చెరువులోకి రాకుండా డైవర్ట్ చేయడంతోపాటు, చెరువు వెడల్పు, కట్టను పటిష్టం చేయడం, అందమైన మొక్కలను పెంచి సుందరంగా తీర్చిదిద్దనున్నారు. పనుల లక్ష్యం మహత్తరమైనదే అయినప్పటికీ, ఇక్కడి అధికారులు పనులు చేపడుతున్న తీరు లోపభూయిష్టంగా మారింది. ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన మురుగు బరి చెరువులోకి రాకుండా...మురుగు కాల్వను డైవర్ట్ చేసి పైప్‌లైన్ ద్వారా ముట్రాజ్పల్లిలోని మొండికుంటలోకి తీసుకురాబోతున్నారు. ఇందుకోసం కిలోమీటర్ మేర పైప్‌లైన్ నిర్మాణం జరుగుతోంది. మీటర్ వైశాల్యం కలిగిన సిమెంట్ పైప్‌లను ఇందుకోసం వాడుతున్నారు.
మొండి కుంట కలుషితం
మురుగును డైవర్ట్ చేయడానికి సాగుతున్న పైప్‌లైన్ నిర్మాణం వల్ల ఇక మొండికుంట కలుషితం కాబోతోంది. అధికారులు చెబుతున్న మాటమేటంటే మొండి కుంట మురుగుతో నిండితే కాల్వల ద్వారా లక్ష్మీప్రసన్న కాలనీ, సిరిఎన్క్లేవ్, బాలాజీ ఎన్‌క్లేవ్‌ల మీదుగా రాజిరెడ్డిపల్లి, క్యాసారం చెరువుల్లోకి వెళ్తోంది.. ఇలా నిరంతరం పారడం వల్ల మురుగు వాసన ఉండదని. కానీ అధికారులు చెబుతున్నట్లుగా.. మొండికుంట నుంచి మురుగు సాఫీగా వెళ్లడానికి కాల్వల వ్యవస్థ లేదు. వర్షాకాలం వస్తే వరద నీరే ఏటా కాలనీలను ముంచెత్తుతోంది. ప్రస్తుతం మురుగు నీరు అదే తరహాలో ప్రవాహిస్తే కాలనీల్లో జనం దుర్వాసన మధ్య కాలమెళ్లదీయాల్సిన పరిస్థితి రాబోతుంది. ఈ పరిస్థితి ప్రజారోగ్యానికి ముప్పుగా మారబోతుందనడంలో సందేహం లేదు.
ఎస్టీపీ నిర్మాణంతోనే సమస్యకు పరిష్కారం
ఎస్టీపీ(సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్) నిర్మాణంతో ఈ సమస్యకు చెక్ పడనున్నది. మురుగును మొండికుంటలోకి అక్కడి నుంచి కాలనీలమీదుగా తరలించే ఆలోచనను అధికారులు వెంటనే విరమించుకోవాల్సి ఉంది. మురుగు తరలింపు కోసం నిర్మిస్తున్న పైప్‌లైన్‌ను డైరెక్ట్‌గా ఎస్టీపీలో కలిపేందుకు.. చర్యలు తీసుకోవాలి. లేదంటే పట్టణంలో రాబోవు రోజుల్లో ముంచెత్తే మురుగుతో జనం అవస్థలు పడటం ఖాయంగా కనిపిస్తున్నది.
రూ.3.14కోట్ల వ్యయం
బరి చెరువు సుందరీకరణ కోసం...
మురుగు మొండి కుంటలోకి తరలింపు
ప్రజారోగ్యానికి పొంచివున్న ముప్పు
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ దుస్థితి
పరిశీలన చేస్తాం
మొండికుంటలోకి మురుగు తరలింపు ఆలోచన నిజమే. కానీ అక్కడి నుంచి కాల్వల ద్వారా మురుగు సాఫీగా వెళ్లిపోతుందని అనుకొని పనులు చేపడుతున్నాం. దీనిపై మరోసారి క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతాం. ప్రజలకు ఇబ్బంది కలుగుతుందనుకుంటే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెడతాం.
–మహేశ్, ఏఈ, ప్రజారోగ్య శాఖ


