ప్రజావాణి అర్జీలపై నిర్లక్ష్యం తగదు | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి అర్జీలపై నిర్లక్ష్యం తగదు

Oct 13 2026 11:37 AM | Updated on Oct 13 2026 11:37 AM

● కలెక్టర్‌ హైమావతి

● వచ్చిన దరఖాస్తులు 91

సిద్దిపేటరూరల్‌: ప్రజావాణి కార్యక్రమంలో అందించిన అర్జీలను నిర్లక్ష్యం చేయవద్దని కలెక్టర్‌ హైమావతి అధికారులను హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు అందజేసి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. మండల స్థాయిలో జరిగే ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను శాఖల వారీగా పర్యవేక్షించి పరిష్కారానికి చర్యలు తీసుకొని నివేదికలు అందజేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ లక్ష్మీకిరణ్‌, డీఆర్‌ఓ నాగరాజమ్మ, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

హుస్నాబాద్‌: బతుకమ్మ నిమజ్జనానికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని కలెక్టర్‌ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం బతుకమ్మ పండుగను పురస్కరించుకొని హుస్నాబాద్‌ ఎల్లమ్మ చెరువు కట్టపై చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బతుకమ్మ పండుగకు వచ్చే మహిళలు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. చెరువు కట్ట పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వాహణ, తాగునీటి సరఫరా, విద్యుత్‌ దీపాల ఏర్పాటు చేయాలన్నారు. ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్‌ నియంత్రణ, మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దండి లక్ష్మి, వైస్‌ చైర్‌ పర్సన్‌ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, తహసీల్దార్‌, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈవీఎంల గోదాం పరిశీలన

సిద్దిపేటరూరల్‌: ఈవీఎంల గోదాం వద్ద నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ పక్కన గల ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల గోదాంను కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గోదాంలో ఈవీఎంల భద్రత, సీసీ కెమెరాల పనితీరు, భద్రతా సిబ్బంది విధులు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై ఆరాతీశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement