రిజర్వాయర్ల ఖిల్లా
సమీకృత కలెక్టరేట్
జిల్లా ఆవిర్భావంతో పాలన చేరువైంది.. అధికారుల పర్యవేక్షణ పెరిగింది. జిల్లా ఏర్పాటై రేపటికి పదేళ్లు పూర్తవుతోంది. ప్రత్యేక రాష్ట్రం తర్వాత నాటి నినాదాలు.. నేడు నిజమయ్యాయి. జిల్లా అవతరణ.. గోదావరి నీళ్లు.. చుక్ చుక్ రైలు వచ్చింది. మెదక్, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి విడిపోయి 23 మండలాలతో సిద్దిపేట జిల్లా అవతరించింది. పాలన, ప్రగతితో పాటు వివిధ రంగాల్లో గణనీయమైన మార్పు వచ్చింది. తిప్పలు లేని రవాణా సౌకర్యం, చేరువలోనే పాలన, పథకాల అమల్లో పారదర్శకత సిద్ధించాయి. పర్యాటక రంగం సైతం ఎంతో అభివృద్ధి చెందింది. జిల్లా పదేళ్ల పండుగను ఈ నెల 9నుంచి 11వ తేదీవరకు నిర్వహిస్తున్నారు.
– సాక్షి, సిద్దిపేట
సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక ప్రాంతాలు, కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్, బెజ్జంకి, కోహెడ మండలాలతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో భాగమైన చేర్యాల, మద్దూరు మండలాలను కలిపి కొత్త జిల్లాగా రూపాంతరం చెందింది. అక్టోబర్ 11, 2016లో దసరా పండుగ నాడు 23 మండలాలతో జిల్లా ఆవిర్భవించింది. తరువాత దుల్మిట్టను మండలంగా ప్రకటించారు. జిల్లాలో 298 గ్రామ పంచాయతీలు ఉండగా 508 గ్రామ పంచాయతీలుగా పెంచారు. గతంలో ఒక మున్సిపాలిటీ, రెండు నగర పంచాయతీలుండేవి. ప్రస్తుతం సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలుగా ఏర్పాటయ్యాయి. తర్వాత ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అక్కన్నపేట, కుకునూరుపల్లి, అక్బర్‌పేట–భూంపల్లి మండలాలను ఏర్పాటు చేసుకుంటూవచ్చారు. దీంతో ప్రస్తుతం జిల్లాలో 26 మండలాలున్నాయి.
రైలు కూత
సిద్దిపేటకు రైలు తీసుకురావాలని గతంలో నినాదాలు ఉండేవి.. ఇప్పుడు ఆ కల నేరవేరింది. రూ.1,200 కోట్ల వ్యయంతో మనోహరాబాద్ నుంచి సిద్దిపేటకు రైల్వే ట్రాక్‌ను నిర్మించారు. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌కు 3 అక్టోబర్ 2023న రైలు ప్రారంభమైంది. జిల్లా ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. రైలు రాకతో జిల్లా మరింత పారిశ్రామికంగా అభివృద్ధి దిశలో ముందుకు సాగుతోంది. రైలు సౌకర్యంలో మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశాలున్నాయి. సిద్దిపేటలో ఐటీ టవర్ నిర్మాణంతో సాఫ్ట్‌వేర్ రంగం సిద్దిపేట వైపు మళ్లింది.
విద్యాకేంద్రంగా జిల్లా మారింది. జిల్లా ఏర్పాటయ్యాక మెడికల్, నర్సింగ్ కళాశాలు, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన యూనివర్సిటీ, అటవీ కళాశాల, పాలిటెక్నిక్‌లు, అగ్రికల్చర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పలు నూతన కోర్సులు, కేంద్రీయ విద్యాలయాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఇతర ప్రాంతాలకు ఉన్నత చదువుల కోసం వెళ్లకుండా జిల్లాలోనే విద్యను అభ్యసిస్తున్నారు.
రిజర్వాయర్ల ఖిల్లాగా జిల్లా మారింది. రంగనాయకసాగర్, కొమురవెల్లి మల్లన్నసాగర్, కొండ పోచమ్మ, అనంతగిరి రిజర్వాయర్లను నిర్మించారు. దీంతో గోదావరి నీళ్లు సిద్దిపేటకు చేరాయి. ఈ రిజర్వాయర్లు జిల్లాలో లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్నాయి.
జిల్లా ఏర్పాటు కావడంతో అభివృద్ధి పథంలో జిల్లా ముందుకు సాగుతోంది. సిద్దిపేట శివారులోని దుద్దెడలో సమీకృత కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్ కార్యాలయాలను నిర్మించారు. జూన్ 20, 2021న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ రెండు కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోనే మొదటి సమీకృత కలెక్టరేట్ ప్రారంభించారు.. గతంలో ఒక్కో దగ్గర ఒక్కో ప్రభుత్వ కార్యాలయం ఉండేది. ప్రస్తుతం జిల్లాకు చెందిన 40 శాఖలకు చెందిన ప్రభుత్వం కార్యాలయాలు అన్ని సమీకృత కలెక్టరేట్‌లోనే ఉన్నాయి.


