● మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
● మంత్రిని కలిసిన ఏఎంసీ చైర్మన్లు
దుబ్బాక: రైతులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా వ్యవసాయ మార్కెట్ కమిటీల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీల చైర్మన్లు మంత్రిని కలిసి మార్కెట్లలో నెలకొన్న సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను విన్న మంత్రి తప్పకుండా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఏఎంసీ చైర్మన్లు తెలిపారు. కార్యక్రమంలో దుబ్బాక, తొగుట, మిరుదొడ్డి, దౌల్తాబాద్, చేగుంట ఏఎంసీ చైర్మన్లు కొంగరి రవి, అమర్‌రెడ్డి, శ్రీధర్, కనకయ్య, తాడెం వెంగళ్‌రావు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
గజ్వేల్: నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవాలని తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొట్టాల యాదగిరి డిమాండ్ చేశారు. శుక్రవారం గజ్వేల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓట్లేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలను కేసీఆర్ ఏ ఒక్కరోజూ కలవకపోవడం దారుణమన్నారు. నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి పథకాలు అందక ప్రజలు ఇబ్బందిపడుతున్నారని వాపోయారు. మరోవైపు రింగు రోడ్డు పనుల పెండింగ్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ నిర్వాసితుల ఇబ్బందులను పట్టించుకునే నాథుడే కరువయ్యారని చెప్పారు. కేసీఆర్ ఇప్పటికై నా సమస్యలపై స్పందించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎడ్ల నర్సింహులు, లింగని రాజు తదితరులు పాల్గొన్నారు.
దుబ్బాకటౌన్: బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని రాష్ట్ర బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరమ్ చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ చిరంజీవులు అన్నారు. శుక్రవారం దుబ్బాక పట్టణంలోని పద్మశాలిభవన్‌లో నిర్వహించిన బీసీ హక్కుల పోరాట సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంఘాల రాష్ట్ర నాయకులు కూరపాటి బంగారయ్య, శ్రీరాం నరేందర్, మచ్చ శ్రీనివాస్, ఆకుల దేవేందర్, రణం శ్రీనివాస్, సిద్ధిరాములుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


