కరెంటు కోతలపై కన్నెర్ర | - | Sakshi
Sakshi News home page

కరెంటు కోతలపై కన్నెర్ర

Oct 10 2026 8:02 AM | Updated on Oct 10 2026 8:02 AM

● విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ముట్టడి

● అధికారుల నిలదీత

అక్కన్నపేట(హుస్నాబాద్‌): అప్రకటిత విద్యుత్‌ కోతలను నిరసిస్తూ అక్కన్నపేట మండల కేంద్రంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు ముట్టడించారు. పెద్ద ఎత్తున్న ర్యాలీగా వెళ్లి రోడ్డుపై బైఠాయించారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో విద్యుత్‌ శాఖ ఏడీ ఉపేందర్‌, ఏఈ బద్దం హరీశ్‌రెడ్డి అక్కడికి రాగా.. విద్యుత్‌ కోతలపై నిలదీశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి నిరంతర త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. కనీసం ఐదు గంటలు కూడా ఇవ్వడంలేదని ఆరోపించారు. ఈ ఒక్క నెల కరెంట్‌ సక్కగా ఇస్తే పంటలు చేతికొస్తాయని అన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌, బీజెపీ పార్టీ నాయకులు, సర్పంచులు భూక్య కృష్ణనాయక్‌, కొడముంజ బాలరాజు, నాయకులు పాల్గొన్నారు.

విద్యుత్‌ కోతలపై నిరసన

గజ్వేల్‌: విద్యుత్‌ కోతలను నిరసిస్తూ గజ్వేల్‌ మండలం కొడకండ్ల 33/11కేవీ సబ్‌స్టేషన్‌ ఎదుట శుక్రవారం రైతులు ధర్నా చేపట్టారు. మాజీ ఎంపీటీసీ అశోక్‌ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవసాయానికి ఆరేడు గంటలకు మించి కరెంట్‌ సరఫరా ఇవ్వడం లేదని, అదీ కూడా ఓ–ఓల్టేజీతో వస్తుండటంతో తరుచూ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని బీఆర్‌ఎస్‌ నాయకులు, రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కరెంట్‌ సరఫరా తీరు మారకపోతే రాజీవ్‌ రహదారిని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు భాస్కర్‌, నర్సింహులు, కర్ణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి

మిరుదొడ్డి(దుబ్బాక): రైతాంగాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంట్‌ కోతలను నిరసిస్తూ అక్బర్‌పేట–భూంపల్లి మండల కేంద్రంలో శుక్రవారం రైతులతో కలిసి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్‌ను సరాఫరా చేయాలని కోరుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన మాట్లాడుతూ పంటలు చేతికి వచ్చే కీలక సమయంలో కరెంటు కోతలు విధిస్తుండటంతో రైతులు నష్టాల బాట పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న విద్యుత్‌ శాఖ డీఈ రామచంద్రయ్య ఆందోళనకారుల వద్దకు చేరుకుని ఎమ్మెల్యేతో పాటు, రైతులతో మాట్లాడారు. రైతాంగానికి 18 గంటలు నిరంతరం కరెంటు సరఫరా చేయాలని, లేదంటే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ ఆందోళనను విరమించారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, కమిషన్‌ మాజీ చైర్మన్‌ బక్కి వెంకటయ్య, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. సుమారు గంట పాటు సాగిన ఆందోళనతో సిద్దిపేట–మెదక్‌ రహదారికిరువైపులా భారీగా వాహనాలు ఎక్కడిక్కడ నిలిచి పోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement