టీబీ రహిత పంచాయతీల గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

టీబీ రహిత పంచాయతీల గుర్తింపు

Oct 9 2026 6:48 AM | Updated on Oct 9 2026 6:48 AM

జిల్లాలో 12 గ్రామాలకు ప్రశంసా పత్రాలు

సిద్దిపేటకమాన్‌: జిల్లాలో 12 గ్రామ పంచాయతీలు టీబీ కేసులు లేని గ్రామాలుగా గుర్తించినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ధనరాజ్‌ తెలిపారు. ఈ మేరకు ఆయా సర్పంచ్‌లకు భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా జారీ చేసిన ప్రశంసా పత్రాలను గురువారం జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ వినోద్‌బాబ్జితో కలిసి డీఎంహెచ్‌ఓ అందజేసి, అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో అంటువ్యాధుల నియంత్రణకు గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు వైద్యారోగ్యశాఖతో సమన్వయంతో పనిచేయాలన్నారు. టీబీ రహిత గ్రామ పంచాయతీలుగా గుర్తింపు పొందేందుకు కృషి చేసిన వారిని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో టీబీ సూపర్‌వైజర్లు రాజు, మల్లయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మార్కెట్‌ కమిటీ కార్యదర్శిగా పరమేశ్వర్‌

దుబ్బాకటౌన్‌: దుబ్బాక వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యదర్శిగా గ్యాదరి పరమేశ్వర్‌ గురువారం పదవీ బాధ్యత స్వీకరించారు. ఇటీవల కార్యదర్శిగా పనిచేసిన సురేశ్‌ కుమార్‌ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందండం తెలిసిందే. దీంతో పరమేశ్వర్‌కి అదనపు బాధ్యత లు అప్పగించారు. ఈ సందర్భంగా మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో టీఎన్‌జీఓ జిల్లా కార్యదర్శి విక్రమ్‌ రెడ్డి, దుబ్బాక యూనిట్‌ అధ్యక్షుడు మురళి, పలువురు ఉద్యోగులు ఆయనను శాలువాతో సత్కరించారు.

భూములు గుంజుకుంటే ఊరుకోం

సర్వే అధికారులను అడ్డుకున్న రైతులు

హుస్నాబాద్‌: కాలువల కోసం బలవంతంగా మా భూములను గుంజుకుంటే ఊరుకునేది లేదని రైతులు హెచ్చరించారు. గురువారం హుస్నాబాద్‌ పట్టణంలోని సబ్‌స్టేషన్‌ సమీపంలో గౌరవెల్లి ఉప కాలువ భూసేకరణ సర్వేకు వచ్చిన ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు. రైతులు హుస్నాబాద్‌– కరీంనగర్‌ రహదారిపై ఆందోళన చేసే ప్రయత్నంలో పోలీస్‌లు వచ్చి అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ హుస్నాబాద్‌ నుంచి కొత్తపల్లి వరకు ఫోర్‌ వే లైన్‌ నిర్మాణం కోసం ఎకరాల కొద్ది భూమిని కోల్పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని సార్లు మా భూములను ఇవ్వాలని, ఉన్నదంతా తీసుకుంటే మేమెట్ల బతికేదని వాపోయారు. బలవంతంగా లాక్కుంటే పోరా డేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు.

రైతుల ధర్నా

దుబ్బాకరూరల్‌: పంటల సాగుకు నిరంతర కరెంట్‌ ఇవ్వాలంటూ పెద్దగుండవెల్లి సబ్‌ స్టేషన్‌ ఎదుట గురువారం రైతులు ధర్నా చేశారు. ఒక వైపు వర్షాలు లేక.. మరో వైపు కరెంట్‌ కోతలతో పంటలు ఎండిపోయె దశకు చేరాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటల సాగుకు నిరంతర కరెంట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

తొగుట సీఐగా శ్రీను

తొగుట(దుబ్బాక): సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఎం.శ్రీను గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ సీఐగా పనిచేసిన ఎస్‌కే లతీఫ్‌ బదిలీపై వెళ్లారు. దీంతో కరీంనగర్‌ జిల్లా నుంచి శ్రీను ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. కాగా ఏఎంసీ చైర్మన్‌ చెరుకు విజయ్‌రెడ్డి సీఐని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement