● పకడ్బందీగా సంక్షేమ పథకాల అమలు ● ఎల్నినోను సమర్థంగా ఎదుర్కొందాం ● మంత్రి వివేక్
ప్రశాంత్నగర్(సిద్దిపేట): మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనులశాఖ మంత్రి వివేక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని వైశ్య సంక్షేమ సంఘ భవనంలో సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో గల 140 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను, సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ చీరలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ అభివృద్ధి పథకాల రూపకల్పనలో మహిళలకు పెద్దపీట వేసి అమలు చేస్తున్నామన్నారు. మహిళా సంఘాలకు వడ్డీలేని ఋణాలు, కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమాలతోపాటు, మహిళల వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు పెట్రోల్ బంక్ లను కేటాయించి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల కన్నా సిద్దిపేట జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ముందు వరుసలో ఉందన్నారు. ఒక్క సిద్దిపేట నియోజకవర్గంలోనే 3500 ఇళ్లకు 2,500 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. పేదలు కడుపునిండా భోజనం చేయాలనే ఉద్దేశంతో ఉచిత సన్న బియ్యం పథకం, కొత్త రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమాలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఎల్నినో పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొందామని మంత్రి అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, పద్మశాలి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం, సిద్దిపేట ఆర్డీవో సదానందం, సిద్దిపేట నియోజకవర్గ ఆత్మ చైర్మన్ పూజల గోపికృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీ


