రైతన్నకు వరిగోస
● పొట్టదశలోనే ఎండుతున్న పంటలు ● తీవ్రరూపం దాల్చిన కరెంట్ కోతలు ● ఎల్నినోతో తీవ్ర వర్షాభావం ● జిల్లాలో 3.50 లక్షల ఎకరాల్లో వరిసాగు ● పంటలు కాపాడాలంటూ రోడ్డెక్కుతున్న రైతులు
దుబ్బాక: రైతుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. ఎల్నినో ప్రభావంతో ఈ వానాకాలంలో అంతంత మాత్రంగానే వానలు పడటంతో చెరువులు, కుంటల్లో పెద్దగా నీరు చేరలేదు. వరిపంటలన్నా పండుతాయనుకుంటే పుండుమీద కారం చల్లినట్లుగా కరెంట్ కోతలు తీవ్రంగా మారాయి. కనీసం 8 గంటలు కూడా కరెంట్ సరఫరా లేకపోవడంతో నీళ్లు అందక పంటలు ఎండిపోతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరిగ్గా పొట్ట దశలో 80 శాతం వరిచేలు ఉండగా ఇంకా 20 శాతం వరకు ఈని వరిగొలుసులు పాలు పోసుకుంటున్నాయి.ఈ క్రమంలో వరి పంటలకు నీళ్లు ఎక్కువగా అవసరం.
దంచికొడుతున్న ఎండలు..
ఎల్నినో ప్రభావంతో వానల జాడలేక పోగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఇటు కరెంట్ సరిగ్గా రాక నీళ్లు పారక ఎండలతో వరిచేలు చాలా వరకు నెర్రలు బారాయి. ఈ సీజన్లో జిల్లాలో 3.50 లక్షలకు పైగా ఎకరాల్లో వరిపంట సాగైంది. సరిగ్గా ఇంకో నెలరోజులైతే పంట చేతికొస్తుందని ఆశపడిన రైతులకు కరెంట్ కోతలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
రైతుల నిరసనలు
కరెంట్ సక్రమంగా ఇచ్చి ఎండుతున్న తమ పంటలను కాపాడాలంటూ రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత విద్యుత్ అధికారులు స్పందించి నెలరోజులైనా కరెంట్ కనీసం 12 గంటలు ఇచ్చి పంటలు కాపాడాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రజాపాలన అంటే ఇదేనా?
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కరెంట్ కూడా సక్రమంగా ఇవ్వడంలేదు. ప్రజాపాలన అంటే పంటలను ఎండగొట్టడమేనా? రైతులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదు. కరెంట్ సక్రమంగా సరఫరా చేసి పంటలను కాపాడాలి.
– కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే దుబ్బాక


