ఎంపీ రఘునందన్‌రావు
దుబ్బాక: ప్రభుత్వం విద్యారంగంపై పూర్తిగా నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని ఎంపీ రఘునందన్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం భూంపల్లి–అక్బర్పేట మండలం చిన్ననిజాంపేట గ్రామంలో ప్రీ ప్రైమరీ స్కూల్‌ను ప్రారంభించారు. అలాగే విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్స్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయులు సరిగ్గా లేక విద్యవ్యవస్థ కుంటుపడుతుందన్నారు. విద్యారంగాన్ని పటిష్టపరుస్తామంటూ గొప్పలు చెప్పడం తప్పా ఆచరణలో చేసిందేంలేదన్నారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. గ్రామంలో పర్యటించిన ఎంపీ ప్రజల సమస్యలు ఓపిగ్గా విన్నారు. ఈ సందర్భంగా నూతనంగా వేసిన బోర్ మోటార్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ పీరాల మహేష్, ఎంఈఓ అంజాగౌడ్, ఉపాధ్యాయులు, ప్రజలు తదితరులు ఉన్నారు.
ట్రాక్టర్‌కు ట్రాకింగ్ సిస్టమ్
నంగునూరు(సిద్దిపేట): గ్రామ పంచాయతీ ట్రాక్టర్లను ఇతర పనులకు వినియోగించకుండా ట్రాకింగ్ సిస్టమ్ బిగించామని ఎంపీడీఓ శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల ట్రాక్టర్లు, వాటర్ ట్యాంకర్లకు జీపీఆర్ఎస్ ట్రాకింగ్ కిట్టును బిగించారు. అనంతరం ఎంపీడీఓ మాట్లాడు తూ పంచాయతీ వాహనాల వినియోగాన్ని ఆన్లైన్ ద్వారా తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరుకు జీపీఆర్ఎస్ ఏర్పాటు చేశామన్నారు. జిల్లా అధికారులు ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా వాహనాలు ఎక్కడ తిరుగుతున్నాయో పర్యవేక్షిస్తారన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ ప్రభాకర్‌రావు, ఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌గౌడ్, కనకరాజు, పంచాయతీ కార్యదర్శులు, ఉప సర్పంచ్‌లు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఎస్సీ జనరల్
సెక్రటరీగా మల్లేశం
దుబ్బాకరూరల్: కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ జనరల్ సెక్రటరీగా దుబ్బాకకు చెందిన ఇస్తారిగల్ల మల్లేశం నియమితులయ్యారు. బుధవారం జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ తప్పెట శంకర్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘువర్ధన్‌రెడ్డి, వైస్ చైర్మన్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
సేవా జ్యోతి కలశ యాత్ర
హుస్నాబాద్ నుంచి సిద్దిపేట వరకు బైక్ ర్యాలీ
హుస్నాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు కృతజ్ఞతగా బుధవారం హుస్నాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో సేవా జ్యోతి కలశ యాత్రను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమ బాధ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి సేవా జ్యోతి కలశ యాత్ర, బైక్ ర్యాలీని ప్రారంభించారు. హుస్నాబాద్ నుంచి సిద్దిపేట వరకు కార్యకర్తలు బైక్ ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్బంగా రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ సేవా జ్యోతి కేవలం ఒక కార్యక్రమం కాదని, సేవ, త్యాగం, అంకితభావం, నిబద్దతకు ప్రతీకగా నిలిచే జాతీయ సంకల్పం అని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వెంకటేశం, అసెంబ్లీ కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి, కుమారస్వామి, పృథ్వీరాజ్, లక్కిరెడ్డి తిరుమల, స్వరూప, వివిధ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.


