అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయండి ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్
గజ్వేల్: తెలంగాణ కోసం త్యాగాలు చేసిన అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసరాల్లో కాదు.. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో సకల సౌకర్యాలతో ఇళ్లు నిర్మించి ఇస్తే బాగుంటుందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటనపై నిప్పులు చెరిగారు. ఎర్రవల్లిలోని 325 సర్వేనెంబర్లో ఓవర్‌ల్యాప్ పేరిట డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ఈ భూమికి 1970నుంచి మ్యాపు ఉందని, 388 ఎకరాలు ఉన్నట్లు స్పష్టంగా ఉందని చెప్పారు. ఇక్కడ మిగిలిపోయిన భూమిలో అమరవీరుల కుటుంబాలకు కాలనీ నిర్మించాలని నిర్ణయించినట్లు సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నిజంగానే వారిపై చిత్తశుద్ధి ఉంటే...హైద్రాబాద్‌లోని గచ్చిబౌలిలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. సమావేశంలో గజ్వేల్ మార్కెట్ కమీటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బీఆర్ఎస్ గజ్వేల్ పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్‌మీరా, నాయకులు కళ్యాన్‌కర్ నర్సింగరావు, ఊడెం క్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


