ముందే చెప్పిన ‘సాక్షి’
సాక్షి, సిద్దిపేట: నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందిన ముగ్గురు జూనియర్ కళాశాలల అధ్యాపకులను సర్వీస్ నుంచి తొలగించారు. జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లతో విధులు నిర్వర్తించిన లెక్చరర్ల గుట్టును ‘సాక్షి’ రట్టు చేసింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూన్ 2, 2014 వరకు కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేసిన లెక్చరర్లను గత ప్రభుత్వం మే, 2023లో రెగ్యులరైజ్ చేసింది. ఈ నేపథ్యంలో విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు అందజేశారు. కొందరు ఆయా యూనివర్సిటీలలో ఆ కోర్సులు లేకున్నా చేసినట్లు, ఆ యూనివర్సిటీలో చదవకుండానే చదివినట్లుగా సర్టిఫికెట్లను అందజేసినట్లు ఇంటర్ బోర్డు అధికారుల తనిఖీల్లో బయట పడింది. పలువురు నకిలీ సర్టిఫికెట్లను అందించినట్లు ముందే చెప్పిన సాక్షి.. గతేడాది అక్టోబర్ 15న ‘సాక్షి’లో అమ్మో నకిలీ లెక్చరర్లు అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఆగస్టు 8వ తేదీన ముగ్గురు లెక్చలర్లకు ఇంటర్ విద్యాశాఖ నోటీసులు జారీ చేసింది.
అధ్యాపకుల బర్తరఫ్
చిన్నకోడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేస్తున్న కెమిస్ట్రీ అధ్యాపకుడు ప్రసాద్, చేర్యాలలోని జూనియర్ కళాశాలలో మ్యాథ్స్ లెక్చరర్ పరశురాములు , గజ్వేల్లోని జూనియర్ కళాశాలలో ఓకేషనల్ ఆధ్యాపకుడిగా పనిచేస్తున్న అష్రాఫ్లను ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపక ఉద్యోగం నుంచి తొలగించినట్లు వరంగల్ ఆర్జేడీ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ మేరకు డీఐఈఓ రవీందర్ రెడ్డి తెలిపారు.


